icon icon icon
icon icon icon

‘దౌర్జన్య కాండపై’ సామాన్యుల దండయాత్ర!

పుంగనూరు అంటే.. ఐదేళ్ల కిందటి వరకు సాధు జీవి, మేలు జాతి ఆవు స్ఫురణకు వచ్చేది. నేడు కర్కశ దాడులు, దౌర్జన్యాలకు నెలవై తాలిబాన్‌ రాజ్యంగా మారిపోయింది. పాలకుడు చెప్పిందే శాసనం. ప్రశ్నించే వీల్లేదు.

Updated : 06 May 2024 09:18 IST

పెద్దిరెడ్డిని వెంటాడుతున్న ఐదేళ్ల పాపాలు
వైకాపా శ్రేణుల అరాచకాలపై ప్రజల్లో ఆందోళన
గెలుపునకు చెమటోడ్చాలిన పరిస్థితిలో మంత్రి
ఢీ అంటున్న తెదేపా అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి
ప్రచారంలో తగ్గని బీసీవై పార్టీ అభ్యర్థి రామచంద్రయాదవ్‌
ఉత్కంఠ రేపుతున్న పుంగనూరు పోరు
పుంగనూరు నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

పుంగనూరు అంటే.. ఐదేళ్ల కిందటి వరకు సాధు జీవి, మేలు జాతి ఆవు స్ఫురణకు వచ్చేది. నేడు కర్కశ దాడులు, దౌర్జన్యాలకు నెలవై తాలిబాన్‌ రాజ్యంగా మారిపోయింది. పాలకుడు చెప్పిందే శాసనం. ప్రశ్నించే వీల్లేదు. గొంతెత్తే స్వేచ్ఛ లేదు. నచ్చిన పార్టీకి పనిచేసే స్వాతంత్య్రం లేదు. సర్వాధికారాలు గుప్పిట పట్టుకున్న నేత.. తన అనుచరుల ద్వారా ‘పుంగనూరు.. ఓ స్వతంత్ర రాజ్యం’ అన్నట్లుగా మార్చేశారు. 2019లో గద్దెనెక్కింది మొదలు సామాన్యుల హక్కులను కాలరాస్తున్నారు. వైకాపా నాయకులు జనాన్ని భయపెట్టి పెత్తనం చలాయిస్తున్నారు. ఐదేళ్లుగా విపక్షాల సానుభూతిపరులను వెంటాడి వేధిస్తున్నారు. నలుగురు కలిసిన చోట ఏదైనా మాట్లాడుకోవాలన్నా, చుట్టుపక్కల మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు ఉన్నారేమోనని చూసుకోవాల్సినంత భయానక పరిస్థితులు సృష్టించారు. ఇప్పుడదే కర్మఫలం పెద్దాయనను వెంటాడుతోంది. ఇన్నాళ్లూ గూడుకట్టుకున్న అసంతృప్తి ఎన్నికల వేళ బయటపడుతోంది. దౌర్జన్యాలపై విసుగు చెందిన ప్రజలు ఆయనపై దండెత్తే సూచనలు కన్పిస్తున్నాయి. ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి నియోజకవర్గంలోని పుంగనూరు పట్టణంతోపాటు చౌడేపల్లి, సోమల మండలాల్లో ఇటీవల పర్యటించారు. రాజకీయ పరిస్థితులను పరిశీలించారు. అభివృద్ధి లేదన్న భావన కంటే అకృత్యాలు పెరిగాయన్నదే మెజార్టీ ప్రజల ఆవేదన. పెద్దాయన అంటే ఆదర్శంగా ఉండాల్సింది పోయి, తమ ఊరికి చెడ్డపేరు తెస్తున్నారన్న కోపం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ఇవన్నీ పెద్దిరెడ్డికి పెద్ద మైనస్‌గా మారాయి. ఈసారి ఆయన గెలుపు అంత సులువు కాదని, చెమటోడ్చాల్సిందేనని వైకాపా అభిమానులే చెబుతున్నారు.

ఈ ఐదేళ్లలో అంతోడు ఇంతోడు కూడా రౌడీనే. ఎదురుమాట్లాడే పరిస్థితి లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీల వారిని నామినేషన్‌ వేయకుండా చేశారు. ఇట్లాంటి పరిస్థితి బిహార్‌లో కూడా ఉండదేమో!

సోమల మండలం నంజంపేటకు చెందిన చికెన్‌ షాపు కార్మికుడు


ఏది మాట్లాడాలన్నా, దేనిపై చర్చించుకోవాలన్నా ఇక్కడ జంకుతారు. రాజకీయ పార్టీలు, గెలుపోటముల గురించి నాతో సహా ఎవరూ నోరు విప్పరు.

పుంగనూరుకు చెందిన ఆర్మీ మాజీ ఉద్యోగి


గతంలో చేయని కొన్ని అభివృద్ధి పనులు చేశారు. అదేస్థాయిలో దౌర్జన్యాలు, దాడులు పెరిగాయి. అవే పెద్దాయనకు పెద్ద మైనస్‌ అవుతున్నాయి.

సోమల మండలం ఉప్పరపల్లికి చెందిన రైతు


ఒకప్పుడు ట్రాక్టర్‌ ఇసుక రూ.1500. ఇప్పుడు అంతా పోగేసుకొని రూ.4 వేలకు అమ్ముతున్నారు. ఇలాగైతే ఇళ్లు కట్టుకునేదెలా?

చౌడేపల్లి మండలం గౌడుపల్లికి చెందిన కార్పెంటర్‌


వైకాపా నేతల భూకబ్జాలు, దౌర్జన్యాలు శ్రుతి మించాయి. డీకేటీ పట్టా భూములు కాజేశారు. అందరూ లోలోపల గుర్రుగా ఉన్నారు. సమయం కోసం వేచి చూస్తున్నారు.

పుంగనూరుకు చెందిన యువకుడు


పెద్దిరెడ్డికి పోయినసారి దాదాపు 43 వేల మెజారిటీ వచ్చింది. కొన్నిచర్యల వల్ల ఈసారి తగ్గొచ్చు. కష్టపడాల్సిందే. కొద్ది మెజారిటీతోనైనా పెద్దాయన బయట పడతారనుకుంటున్నా.

పుంగనూరుకు చెందిన వైకాపా అభిమాని


ముగ్గురూ రామచంద్రులే

పుంగనూరు అసెంబ్లీ స్థానానికి పోటీ పడుతున్న వారిలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు రామచంద్రారెడ్డే కాగా, భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకుడి పేరు రామచంద్రయాదవ్‌. వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989, 1999, 2004లో పీలేరు నుంచి; 2009, 2014, 2019లో పుంగనూరు నుంచి గెలిచారు. 4 సార్లు కాంగ్రెస్‌ తరఫున గెలవగా, 2013లో వైకాపాలో చేరి గత రెండు పర్యాయాలు భారీ మెజారిటీతో విజయం సాధించారు. తెదేపా నుంచి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు) తొలిసారి బరిలో నిలిచారు. గతంలో తితిదే సభ్యుడిగా వ్యవహరించారు. అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత, పెద్దిరెడ్డి, అనుచరుల ఆగడాలు, ఎన్డీయే పక్షాల మద్దతుతో తన గెలుపు ఖాయమని బాబు ధీమాగా చెబుతున్నారు.


ఎన్నికల్లోపు ఇంకెన్ని దారుణాలో?

ప్పటిదాకా జరిగింది ఒకెత్తు అయితే, పోలింగ్‌ వరకు జరిగే దారుణాలు మరో ఎత్తని గత అనుభవాలను స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఎన్నికల ముందు విపక్షాలను భయపెట్టడం, వారి కార్యకలాపాలను కట్టడి చేయడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. తాజాగా చౌడేపల్లి మండల తెదేపా అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి వాహనాన్ని అడ్డుకొని ధ్వంసం చేశారు. ఈసారి ఓటమి తప్పదన్న ఆందోళనతోనే పెద్దిరెడ్డి అనుచరులు ఇలాంటి చర్యలకు దిగుతున్నారని తెదేపా నేతలు చెబుతున్నారు.


మూడో పార్టీ ప్రభావం ఎవరిపై?

వైకాపా, తెదేపాలకు దీటుగా బీసీవై పార్టీ అభ్యర్థి బోడె రామచంద్రయాదవ్‌ ప్రచారం చేస్తున్నారు. ఆయన గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగి 16 వేలకుపైగా ఓట్లు దక్కించుకున్నారు. నియోజకవర్గంలో 2.38 లక్షలకు పైగా ఓటర్లుండగా 60శాతం బీసీలే. యాదవ సామాజికవర్గం ఓటర్లు సుమారు 30 వేలు. ఆర్థికంగా ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఏమాత్రం తగ్గని యాదవ్‌.. ఈసారీ పెద్ద సంఖ్యలో ఓట్లు సాధిస్తారన్న అంచనాలున్నాయి. ఆయనకు పడే ఓట్లు ఎవరికి చేటు తెస్తాయన్న కలవరం ఇరు పార్టీల్లోనూ నెలకొంది.


అడుగడుగునా ఆగడాలు.. అడిగితే జగడాలు

పుంగనూరు నియోజకవర్గాన్ని అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు, అవినీతి, అక్రమాలకు అడ్డాగా మార్చారన్న అపప్రధ మిగిలింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ వ్యవస్థలను వైకాపా నేతలు తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. బీసీవై పార్టీ వ్యవస్థాపకుడు రామచంద్రయాదవ్‌ ఇంటిపై పెద్దిరెడ్డి అనుచరులు దాడిచేసి బీభత్సం స్పష్టించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. తాజాగా, ఏప్రిల్‌ 29న ఎన్నికల ప్రచారానికి వెళ్లిన యాదవ్‌పై దాడిచేసి, పోలీస్‌స్టేషన్‌ సమీపంలోనే వాహనాలు తగలబెట్టారు.

  • 2023 ఆగస్టులో చంద్రబాబు మదనపల్లి నుంచి చిత్తూరు వెళ్తుండగా పోలీసులు ఆంక్షలు పెట్టడాన్ని తెదేపా కార్యకర్తలు ప్రశ్నించారు. మాటామాటా పెరిగి లాఠీఛార్జికి దారితీసింది. పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్న 300 మంది కార్యకర్తలపై కేసులు పెట్టి, నేటికీ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు.
  • 2020లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు నామినేషన్‌ వేయకుండా పెద్దిరెడ్డి అడ్డుకున్నారన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో పదుల సంఖ్యలో విపక్ష పార్టీల కార్యకర్తలు గాయపడ్డారు. ఇతరులెవరూ నామినేషన్లు వేయకుండా వైకాపా కార్యకర్తలు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాల వద్ద రాళ్లతో సిద్ధంగా ఉన్న చిత్రాలు మీడియాలో విస్తృతంగా వచ్చాయి.
  • శ్రీకాకుళం జిల్లాకు చెందిన తెదేపా కార్యకర్తలు ఆర్నెల్ల క్రితం సైకిల్‌ యాత్ర చేస్తూ పుంగనూరుకు వచ్చారు. వైకాపా నేత ఒకరు ఆపి, నడి రోడ్డుపైనే వారు వేసుకున్న పసుపు రంగు చొక్కాలను విప్పించాడు. సైకిళ్లకున్న జెండాలు పీకేశాడు. పుంగనూరులో తమ జెండా, ఎజెండా మాత్రమే ఉండాలన్న ఫాసిస్ట్‌ ఆలోచనలకు ఈ ఘటన ప్రతీకగా నిలిచింది.
  • ఐదేళ్లుగా వైకాపా శ్రేణుల కనుసన్నల్లో ఇసుక మాఫియా చెలరేగిపోయింది. అనుమతులు లేనిచోట ఇష్టమొచ్చినట్లు తవ్వుకుంది. కాలువలు, నదులను కొల్లగొట్టింది. సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి తెచ్చింది. ఏడాది క్రితం ఇసుక మాఫియాపై మహిళలు తిరగబడ్డారు. మట్టి మాఫియా ఏ ఒక్క చెరువునూ వదిలిపెట్టకుండా దొరికినంత తవ్వుకుంది. దాన్ని రియల్టర్లు వేసే వెంచర్లలో పోసి సొమ్ము చేసుకుంది. పుంగనూరు సమీపంలోని మెలుపట్ల చెరువు నుంచి అనుమతులకు మించి తవ్వడాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు.
  • పెద్దిరెడ్డి కుటుంబానికి శివశక్తి డెయిరీ ఉండటంతో ఏడాది క్రితం వరకు ఇతర డెయిరీలను నియోజకవర్గానికి రానివ్వలేదన్న ఆరోపణలున్నాయి. ఇన్నాళ్లుగా తక్కువ ధరకు పాలు కొని తమను మోసగించారన్న బాధ పాడి రైతుల్లో వ్యక్తమవుతోంది.
  • తెదేపాకు మెజారిటీ వచ్చే కొన్ని గ్రామాలకు వెళ్లే రోడ్లకు మరమ్మతులు చేయలేదు. ఉదాహరణకు సోమల నుంచి ఉప్పరపల్లి, నంజంపేట వెళ్లే రోడ్డు దారుణంగా మారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోలేదు.
  • రైతుల నుంచి దాదాపు 2 వేల ఎకరాల భూమి సేకరించి ఆవులపల్లి, నేతిగుట్టపల్లెలో రిజర్వాయర్లు నిర్మించాలనుకున్నారు. పరిహారం ఇవ్వకుండానే పనులు ప్రారంభించారు. రైతులు కోర్టుకు వెళ్లగా, ప్రాజెక్టులను తెదేపా అడ్డుకుంటోందని దుష్ప్రచారం చేశారు.
  • మామిడి కొనుగోలుకు ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు రాకుండా స్థానిక వైకాపా నేతలు సిండికేట్‌ అయ్యారు. తాము చెప్పిన ధరకే అమ్మాలంటూ రైతులపై ఒత్తిడి తెస్తూ మండీలను శాసిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img