Sharad Pawar: భాజపాతో పొత్తుపై శరద్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు.. అజిత్‌ పవార్‌కు చురకలు!

 భాజపా (BJP)తో చేతులు కలపకూడదనే తమ వైఖరి ఎల్లప్పుడూ స్పష్టంగా ఉందని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్ (Sharad Pawar) పేర్కొన్నారు.

Published : 02 Dec 2023 21:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భాజపా (BJP)తో చేతులు కలపకూడదనే తమ వైఖరి ఎల్లప్పుడూ స్పష్టంగా ఉందని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్ (Sharad Pawar) పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా కొన్ని సూచనలు వచ్చినప్పటికీ.. వాటిని తాను ఆమోదించలేదన్నారు. గతంలో తెల్లవారుజామున ప్రమాణ స్వీకారం చేసిన ఓ వ్యక్తి అది తమ పార్టీ విధానమని(భాజపాతో వెళ్లడం) పేర్కొంటే.. ఆయన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు చురకలంటించారు. మహారాష్ట్రలో అధికార పక్షంతో పొత్తు విషయంలో తనపై అజిత్‌ పవార్‌ ఆరోపణలు చేసిన నేపథ్యంలో శరద్‌ పవార్‌ ఈ మేరకు స్పందించారు.

‘ఎన్సీపీ వైఖరికి విరుద్ధంగా భాజపాకు మద్దతివ్వాలని కొందరు సూచించినప్పటికీ.. నాతో సహా పార్టీలో చాలా మంది అంగీకరించలేదు. భాజపాతో వెళ్లకూడదనే మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. మా అభిప్రాయాలకు, భాజపా సిద్ధాంతాలతో పొంతన కుదరదు’ అని శరద్ పవార్ అన్నారు. గతంలో తెల్లవారుజామున ప్రమాణస్వీకారం చేసిన ఓ వ్యక్తి అది పార్టీ విధానమని పేర్కొంటే.. ఆయన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ అజిత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 2019లో దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా తెల్లవారుజామునే ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే.. సంఖ్యాబలం లేకపోవడంతో నాలుగు రోజుల్లోనే ఈ ప్రభుత్వం కూలిపోయింది. 

ప్రస్తుతం సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతి లోక్‌సభ స్థానంలో తమ వర్గం పోటీ చేస్తుందని అజిత్ పవార్ ప్రకటించడంపై శరద్ పవార్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా.. ఎక్కడి నుంచైనా పోటీ చేసే స్వేచ్ఛ ఉందన్నారు. ఇదిలా ఉండగా.. జులై 2న అజిత్‌ పవార్‌, ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి భాజపా-శివసేన ప్రభుత్వంతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం ఓ కార్యక్రమంలో అజిత్ మాట్లాడుతూ.. మళ్లీ కలిసిపోదామంటూ శరద్ పవార్ వర్గానికి చెందిన ఓ బృందం తనను సంప్రదించిందని చెప్పారు. శివసేన- భాజపా ప్రభుత్వంలో చేరాలన్న నిర్ణయం పవార్‌కు ఇష్టం లేకపోతే.. అలాంటి భేటీకి ఎందుకు ప్రయత్నించారంటూ ప్రశ్నించారు. శరద్‌ పవార్‌ ఒకానొక సమయంలో భాజపాతో పొత్తు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నట్లు గతంలోనూ అజిత్‌ పవార్‌ వర్గం ఆరోపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు