Perni nani-JP nadda: ‘ఓ నడ్డా గారూ.. మీకు చేతనైతే విపక్షాలకు సమాధానం చెప్పండి’: పేర్ని నాని

వైకాపా ప్రభుత్వ పాలనపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్‌ ఇచ్చారు.

Updated : 11 Jun 2023 17:16 IST

అమరావతి: ‘‘మేం చూసిన ప్రభుత్వాల్లో అత్యంత అవినీతిమయమైంది వైకాపా పాలనే. రాష్ట్రంలో కుంభకోణాలకు విరామం లేదు. గనులు, ఇసుక, మద్యం, భూముల వ్యవహారాల్లో పెద్ద ఎత్తున కుంభకోణాలు, అవినీతి జరిగాయి. వైకాపా ప్రభుత్వం అవినీతి, డబ్బు సంపాదనపైనే దృష్టిసారించింది’ అని శ్రీకాళహస్తి సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలకు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్‌ ఇచ్చారు. దిల్లీ నుంచి ఏపీకి వచ్చి ఎవరో చెప్పిన మాటలను బట్టీ పట్టి మాట్లాడటం సరికాదన్నారు. ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

‘‘మేం మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాం. చేతనైతే సమాధానం చెప్పండి. ఏపీలో జగన్‌ నాయకత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్గాల్లోని పేదల ఆర్థిక అభ్యున్నతి కోసం సరాసరి రూ.2,16,000 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో వేశాం. ఇలా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పని చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైకాపా ప్రభుత్వం మాత్రమే. భాజపా పాలిస్తోన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏపీ ఖర్చు చేసిన దాంట్లో సగమైనా కేటాయించారా?రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోయినా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంది. పైసా లంచం ఇచ్చే అవసరం లేకుండా మెరుగైన పాలన అందిస్తున్నాం.

కర్ణాటకలో అవినీతికి పాల్పడిన ప్రభుత్వం ఏదో అక్కడి ప్రజలు గమనించారు కాబట్టే భాజపాకు బుద్ధి చెప్పారు. ఇవాళ ఏపీలో పరిస్థితి చూస్తుంటే.. బీజేపీ కాస్త టీజేపీగా మారినట్లు కనిపిస్తోంది. ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆంధ్రప్రదేశ్‌లో భాజపా ఒక్క స్థానంలో కూడా విజయం సాధించడం సాధ్యం కాదు. దిల్లీలో విపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి. పార్లమెంట్‌లో మోత మోగిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తున్నాయి. ఓ నడ్డా గారూ.. మీకు చేతనైతే మీప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై విపక్షాలకు సమాధానం చెప్పండి’’ అని పేర్ని నాని ఘాటుగా వ్యాఖ్యానించారు.

హరీశ్‌రావు సర్టిఫికెట్‌ మాకవసరం లేదు..

ఏపీ నేతల మాటలు కోటలు దాటుతాయని, చేతలు మాత్రం తక్కువని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏపీకి చెందిన ఇద్దరు నేతల తీరు కారణంగా ఆ రాష్ట్రం ఇప్పుడు బోర్లా పడిందని ఎద్దేవా చేస్తూ మాట్లాడటంపై పేర్ని నాని స్పందించారు. ‘‘చేతలు తక్కువ అనే హరీశ్‌రావును కేసీఆర్‌ పక్కన పెట్టారు. ఇంకోసారి సీఎం జగన్‌ గురించి మాట్లాడితే సరైన సమాధానం చెబుతాం. హరీశ్‌రావు సర్టిఫికెట్‌ మా ప్రభుత్వానికి అవసరం లేదు’’ అని పేర్నినాని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని