ఏపీలో ఫోన్‌ ట్యాపింగ్‌ కలకలం.. ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న తెదేపా

విజయవాడలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్వహించిన పార్టీ వర్క్‌షాప్‌లో ఫోన్‌ ట్యాపింగ్‌ కలకలం రేపింది.

Updated : 23 Mar 2024 20:08 IST

అమరావతి: విజయవాడలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్వహించిన పార్టీ వర్క్‌షాప్‌లో ఫోన్‌ ట్యాపింగ్‌ కలకలం రేపింది. ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నాడంటూ ఓ వ్యక్తిని నేతలు పట్టుకున్నారు. కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఈ పని చేస్తున్నారని తెలుగుదేశం తీవ్ర ఆరోపణలు చేసింది. కేశినేని చిన్ని ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నట్టు నేతలు ఆధారాలు బయట పెట్టారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, పురందేశ్వరి ఫోన్లను కూడా ట్యాప్‌ చేస్తున్నారని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఐజీ పంపితేనే వచ్చానని పట్టుబడిన కానిస్టేబుల్‌ చెప్పాడన్నారు. కేశినేని చిన్ని కదలికలపై నిఘా పెట్టినట్టు తమకు తెలిసిందన్నారు. తమ ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్న ఆధారాలు కానిస్టేబుల్‌ ఫోన్‌లో లభ్యమయ్యాయన్నారు.  ఉన్నతాధికారి సీతారామాంజనేయులు నేతృత్వంలో ట్యాపింగ్‌ వ్యవహారం జరుగుతోందని మండిపడ్డారు.

గత తెలంగాణ ప్రభుత్వం పెగాసెస్ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసినప్పుడే ఏపీ సీఎం జగన్ అదే తరహా సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేశారని ఆరోపించారు. తామిచ్చిన ఫిర్యాదుపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన ఫోన్ ట్యాప్ చేసేలా ఇంటెలిజెన్స్ ప్రయత్నించిందని తెలుగుదేశం విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని తెలిపారు. కానిస్టేబుల్‌ను పట్టుకుంటే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా కొందరు పోలీస్ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని