UP congress: మేమొస్తే 20 లక్షల ఉద్యోగాలు.. ప్రియాంక గాంధీ హామీల వర్షం!

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హామీల వర్షం కురిపిస్తున్నారు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. తాజాగా యూపీ ప్రజలకు మరిన్ని హామీలిచ్చారు.

Updated : 23 Oct 2021 17:42 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హామీల వర్షం కురిపిస్తున్నారు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. తాజాగా యూపీ ప్రజలకు మరిన్ని హామీలిచ్చారు. తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. నేటి నుంచి నవంబర్‌ 1 వరకు కొనసాగే ‘ప్రతిజ్ఞ యాత్రల’ ప్రారంభం సందర్భంగా ఇక్కడి బారాబంకీలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.

తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు. కొవిడ్‌ బాధితులకు రూ.25వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. వారంలో మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటికే మహిళలకు 40 శాతం సీట్లు ఇస్తామని ఆమె ప్రకటించారు. 12వ తరగతి పాసైన విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్లు, డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్‌ స్కూటీలు ఇస్తామన్నారు.

మరోవైపు రైతులను ఆకట్టుకునేందుకు రుణమాఫీని ప్రకటించిన ప్రియాంక.. గోధుమలకు ₹2,500 మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భాజపాపై విమర్శలు గుప్పించారు. లఖింపూర్‌ ఘటనలో రైతుల మృతికి కారణమైన ఆశిష్‌ మిశ్రా అరెస్ట్‌ ఎంత ఆలస్యమైందో చూశామని, ఇప్పటికీ అజయ్‌ మిశ్రా మంత్రి పదవిలో కొనసాగుతున్నారని గుర్తుచేశారు. రైతులకు అధికార భాజపా ఎంత విలువ ఇస్తుందో చెప్పేందుకు ఇవే ఉదాహరణలు అని ప్రియాంక ఎద్దేవాచేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని