Punjab Polls: పంజాబ్‌లో ఆప్‌ సీఎం అభ్యర్థి ఆయనేనా?

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న రాజకీయ సందడి మొదలైంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన ప్రధాన రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలు ప్రతివిమర్శలతో రాజకీయాల్లో  హీటు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధికార పీఠాన్ని నిలుపుకొనేందుకు......

Published : 05 Jan 2022 01:54 IST

దిల్లీ: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న రాజకీయ సందడి మొదలైంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన ప్రధాన రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలు ప్రతివిమర్శలతో రాజకీయాల్లో  హీటు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధికార పీఠాన్ని నిలుపుకొనేందుకు భారీ హామీలతో ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుండగా.. ప్రధాన ప్రతిపక్షం ఆప్‌ కూడా ప్రచారంలో తనదైన వ్యూహంతో దూసుకెళ్తోంది. అయితే, పంజాబ్‌లో కాంగ్రెస్‌కు అసలైన పోటీదారుగా అవతరించిన ఆప్‌నకు సీఎం అభ్యర్థి ఎవరనే అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే, సీఎం అభ్యర్థిగా ఆప్‌ ఎంపీ భగవంత్‌ మాన్‌ పేరే ప్రధానంగా  వినబడుతోంది. సీఎం అభ్యర్థిగా ఆయననే ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఆప్‌ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి.

గతేడాది డిసెంబర్‌లో భాజపాను ఉద్దేశించి భగవంత్‌ మాన్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమ పార్టీలో చేరితే డబ్బు, కేంద్రమంత్రి పదవి ఇస్తామంటూ భాజపాకు చెందిన ఓ నేత తనకు ఆఫర్‌ చేశారంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఆ ఆఫర్‌ని తాను తిరస్కరించానని.. డబ్బు లేదా ఇతర ప్రలోభాలు చూపించి తనను కొనలేరని స్పష్టం చేసినట్లు అప్పట్లో మాన్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భాజపా రాజకీయాలన్నీ ఇతర పార్టీల్లోంచి నేతల్ని లాక్కొవడంపైనే ఆధారపడతాయంటూ.. గోవా, బెంగాల్‌, మధ్యప్రదేశ్‌లు ఉదాహరణలుగా పేర్కొంటూ కమలదళంపై మండిపడ్డారు. ఇటీవల చండీగఢ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఆప్‌ తన హవా చాటింది. 35 సీట్లకు గాను 14 చోట్ల విజయదుందుభి మోగించింది.  అలాగే, కాంగ్రెస్‌ కూడా ఈ ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరిచి గతంలో నాలుగు స్థానాల నుంచి ఎనిమిది స్థానాలకు ఎగబాకిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం పార్టీ రాష్ట్ర చీఫ్‌గా కొనసాగుతున్న సంగ్రూర్‌ ఎంపీ భగవంత్‌ మాన్‌ సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దిల్లీ సీఎం, పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కొవిడ్‌ బారినపడటంతో ఈ ప్రకటన ఆలస్యమైనట్టు పేర్కొంటున్నాయి.  ఇటీవల జరిగిన చండీగఢ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో తన సత్తా చాటిన ఆప్‌.. రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించేందుకు సిద్ధమైంది. అధికార కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు, అకాలీదళ్‌ పార్టీ క్షీణించడం, మూడు వ్యవసాయ చట్టాలపై భాజపా పట్ల ఉన్న వ్యతిరేకతలను తన బలంగా మార్చుకొని ఈసారి ఎన్నికల్లో భారీ విజయం సాధించాలన్న సంకల్పంతో ఉంది. దిల్లీ తరహా పాలనను అందిస్తామంటూ ఆప్‌ హామీలు ఇస్తోంది. ఉచిత విద్యుత్‌, తాగునీరు, ఇంటి వద్దకే సేవలు, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపైనే ఎక్కువగా ఫోకస్‌ పెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని