రాహుల్‌.. ఆరెస్సెస్‌ సమావేశాలకు వెళితే తెలుస్తుంది: అనురాగ్‌ ఠాకూర్‌

Anurag Thakur on Rahul Gandhi: రాహుల్‌ గాంధీ విమర్శలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తిప్పికొట్టారు. ఆరెస్సెస్‌ గురించి తెలియాలంటే ఆ సంస్థ నిర్వహించే క్యాంపులకు హాజరుకావాలని సూచించారు.

Published : 08 Mar 2023 01:26 IST

దిల్లీ: బ్రిటన్‌ పర్యటనలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భాజపా విమర్శల దాడి పెంచింది. ఆరెస్సెస్‌పై ఆయన వ్యాఖ్యలనూ తప్పుబట్టింది. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (RSS) శిబిరాలకు హాజరైతే దాని గొప్పతనం తెలుస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. విదేశీ గడ్డపై భారత్‌ను అవమానించడం తగదని దుయ్యబట్టారు. ఈ మేరకు దూరదర్శన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, దాని గుర్తించడంలో అమెరికా, యూరప్‌ సైతం విఫలమయ్యాయంటూ లండన్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో రాహుల్ గాంధీ విమర్శించారు. ఆరెస్సెస్‌ను ఓ ఫాసిస్టు సంస్థగా అభివర్ణించారు. దేశంలో వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్య విలువలను నాశనం చేస్తోందని ఆరోపించారు. ఈ విమర్శలపై అనురాగ్‌ ఠాకూర్‌ తాజాగా స్పందించారు. ‘‘ఆరెస్సెస్‌ అనేది ఓ స్వతంత్ర సంస్థ. దేశ ఐక్యతకు, సమగ్రత కోసం దేశం నలుమూలలా పనిచేస్తోంది. ఈ దేశానికి ఆరెస్సెస్‌ ఎంతో చేసింది. రాహుల్‌కు ఓ విషయం చెప్పదలచుకున్నా. ఆరెస్సెస్‌ క్యాంపులకు హాజరైతే దాని గొప్పతనం తెలుసుకుంటారు. ప్రధాని మోదీ కూడా ఆరెస్సెస్‌ నుంచి వచ్చిన వారే. 2001 నుంచి ఆయన ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. ఆయన నిబద్ధత అలాంటిది’’ అని అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు.

ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ రాహుల్‌ చేసిన విమర్శలనూ అనురాగ్‌ ఠాకూర్‌ ఖండించారు. ప్రమాదంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదని, కాంగ్రెస్‌ పార్టీ అని ఎద్దేవాచేశారు. ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం చూపలేకపోయిందని గుర్తుచేశారు. ఇప్పటికే అమేఠీ విడిచి రాహుల్‌ వయనాడ్‌ పారిపోయారని విమర్శించారు. ప్రధానిపై కోపం ఉంటే విదేశీ గడ్డపై ఆయనపై విమర్శలు చేసుకోవచ్చు గానీ భారత్‌ను అవమానించడం సరికాదు అని హితవు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని