Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్‌ ఠాక్రే కీలక ట్వీట్‌

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఉద్ధవ్‌ ఠాక్రే(Uddhav Thackeray) సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన(MNS) అధినేత రాజ్‌ ఠాక్రే(Raj Thackeray) తాజాగా స్పందించారు. ‘ఒక వ్యక్తి తన అదృష్టాన్ని సొంత విజయంగా...

Published : 30 Jun 2022 15:40 IST

ముంబయి: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఉద్ధవ్‌ ఠాక్రే(Uddhav Thackeray) సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన(MNS) అధినేత రాజ్‌ ఠాక్రే(Raj Thackeray) తాజాగా స్పందించారు! ‘ఒక వ్యక్తి తన అదృష్టాన్ని సొంత విజయంగా భావించిన నాటినుంచే.. అతని పతనం మొదలవుతుంది’ అని గురువారం ఆయన ఓ ట్వీట్‌ చేశారు. అయితే, సీఎం పదవికి రాజీనామా చేసిన ఉద్ధవ్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్య చేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

‘మహావికాస్‌ అఘాడీ’ పేరిట కాంగ్రెస్‌, ఎన్సీపీలతో జట్టుకట్టిన శివసేన(Shivsena).. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉద్ధవ్‌ ఠాక్రే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, సీఎం కుర్చీ కేవలం అదృష్టంతో దక్కిందని, అందులో ఉద్ధవ్ సాధించిందేమీ లేదని రాజ్‌ ఠాక్రే పరోక్షంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఏక్‌నాథ్‌ శిందే వర్గాన్ని బుజ్జగించడంలో విఫలమైన ఉద్ధవ్‌.. బుధవారం రాత్రి ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయిన విషయం తెలిసిందే. విశ్వాస పరీక్షకు ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు.

బాల్‌ ఠాక్రే సోదరుడు శ్రీకాంత్‌ ఠాక్రే కుమారుడే రాజ్‌ ఠాక్రే. ఉద్ధవ్‌కు వరుసకు సోదరుడు. అంతకుముందు రాజ్‌ ఠాక్రే కూడా శివసేనలోనే ఉండేవారు. అయితే పార్టీ సారథ్య బాధ్యతల విషయంలో ఠాక్రే కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. దీంతో 2006లో పార్టీ నుంచి బయటకు వచ్చిన రాజ్‌.. మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. తన పోరాటం శివసేన నాయకత్వం మీద కాదని.. ఇతరులను రానివ్వకుండా అడ్డుకుంటున్న కొందరిపైనేనని ఆ సమయంలో చెప్పుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని