Revanth reddy: ఊరికో కోడి ఇంటికో ఈక అన్నట్లుగా ‘దళితబంధు’ అమలు: రేవంత్‌ రెడ్డి

దళిత సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీరని అన్యాయం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ఆరోపించారు. తొలి దళిత సీఎం మొదలు ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి వరకు ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.

Published : 03 Feb 2023 21:43 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR)కు ఓట్లు అడిగే హక్కు లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. భారాస(BRS) పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ.. సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తదితర అంశాలను లేఖలో ప్రస్తావించారు. రైతులకు రూ.లక్ష రుణ మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని పేర్కొన్నారు. గడిచిన నాలుగేళ్లలో రెండు విడతలు కలిపి కేవలం రూ.3,881 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసినట్లు తెలిపారు. ఇంకా రూ.20,857 కోట్ల రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారన్నారు. 

దళిత సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీరని అన్యాయం చేస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. తొలి దళిత సీఎం మొదలు ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల భూమి వరకు ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇప్పుడు దళితబంధు పేరుతో ఆ వర్గాలను మరొకసారి వంచించేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఈ పథకం అమలు తీరు చూస్తే ఊరికో కోడి ఇంటికో ఈక అన్నట్లు తయారైందని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగానే నీరు కార్చినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. రూ.35,200 కోట్లతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం రూ.60వేల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. గత బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు కేవలం రూ.1,225 కోట్లు మాత్రమేనన్న రేవంత్.. ఇలా కేటాయింపులు చేస్తే ఈ ప్రాజెక్టు మరో 60 నుంచి 70ఏళ్లకు కూడా పూర్తి కాదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై గడిచిన తొమ్మిది ఏళ్లుగా భారాస పార్టీ  ప్రజలను ఊరిస్తేనే ఉందని విమర్శించారు. సొంత జాగా ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షలు ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. గత బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకానికి ఇంతవరకు మార్గదర్శకాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నట్లు చెబుతున్న మాటలు వట్టి బూటకమని విమర్శించారు. గృహ వినియోగదారులపై  ఏసీడీ పేరుతో అదనపు విద్యుత్‌ ఛార్జీల భారం మోపుతున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని