ఓ చోట పొత్తులు.. ఇంకో చోట కత్తులు!

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులూ ఉండరు అనేది నానుడి. రాజకీయాల్లో ఇద్దరు బద్ద శత్రువులో.. రెండు వైరి రాజకీయ పక్షాలు ఒక్కటైనప్పుడో ఇలాంటి మాటలు.....

Updated : 05 Mar 2021 02:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులూ ఉండరు అనేది నానుడి. రాజకీయాల్లో ఇద్దరు బద్ద శత్రువులో.. రెండు వైరి రాజకీయ పక్షాలు ఒక్కటైనప్పుడో ఇలాంటి మాటలు వినిపిస్తుంటాయి. కానీ, ఒక చోట మిత్రుడిగా.. ఇంకో చోట ప్రత్యర్థిగా.. ఓ చోట స్నేహహస్తం అందిస్తూ.. మరో చోట ప్రత్యర్థికి ఆపన్నహస్తం అందించే కొత్త ట్రెండ్‌ ప్రస్తుత రాజకీయాల్లో నడుస్తోంది. కొద్ది రోజుల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయ్‌.

పొత్తులు- కత్తుల గురించి చెప్పుకోవాల్సి వస్తే కాంగ్రెస్‌- వామపక్షాల గురించే తొలుత చర్చించుకోవాలి. కేరళలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌.. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ బద్ద శత్రువులు. కొన్నేళ్లుగా ఆ రాష్ట్రంలో ఈ రెండు కూటములదే పైచేయి. ఏ అవకాశం ఉన్నా సత్తా చాటాలని భాజపా యత్నిస్తున్నప్పటికీ వీలు చిక్కడం లేదు. కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేరళలోనే తిష్ట వేశారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి సముద్రంలో దూకడం.. చేపలు పట్టడం వంటి ఫీట్లు చేశారు. ‘రాహుల్‌ పర్యటన వల్ల మా రాష్ట్ర పర్యాటకానికి ఊతమిచ్చినట్లయ్యింది. థ్యాంక్స్‌ రాహుల్‌’ అంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, సీపీఎం నేత విజయన్‌ వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. ఇది కేరళలో పరిస్థితి. ఇక పశ్చిమ బెంగాల్‌ విషయానికొస్తే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. తృణమూల్‌, భాజపాను ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకుండా ఈ రెండు పార్టీలూ జట్టుకట్టాయి. ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎఫ్‌)ను సైతం తమ జట్టులోకి చేర్చుకుని కూటమిగా బరిలోకి దిగాయి.

స్టేట్‌ దాటితే.. రూట్‌ వేరే!

మహారాష్ట్రలో ప్రస్తుతం శివసేన- ఎన్సీపీ- కాంగ్రెస్‌ నేతృత్వంలో మహా అఘాడీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్‌కు శివసేనకు మధ్య పెద్దగా మిత్రత్వం లేనప్పటికీ.. చాలా విషయాల్లో కాంగ్రెస్‌ను శివసేన వెనకేసుకొస్తోంది. ఇదే శివసేన పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికొచ్చేసరికి తృణమూల్‌కు స్నేహహస్తం అందిస్తోంది. అక్కడ దీదీ వర్సెస్‌ అందరూ అన్న పరిస్థితి నెలకొంది కాబట్టే టీఎంసీకి మద్దతు ఇస్తున్నామని ఆ పార్టీ ప్రకటించింది. అంతే కాదు మమతను రియల్‌ బెంగాల్‌ టైగర్‌ అని అభివర్ణిస్తూ పొగడ్తల్లో ముంచెత్తుతోంది. ఇదే రాష్ట్రంలో మమతకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌- వామపక్షాలు పనిచేస్తుండడం గమనార్హం.

* గతేడాది బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ- కాంగ్రెస్‌ కూటమిగా బరిలోకి దిగాయి. వాస్తవానికి గెలుపు ఈ కూటమిదేనని అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పుకొచ్చాయి. తీరా ఫలితాలు మాత్రం భాజపా- జేడీయూకు అనుకూలంగా వచ్చాయి. ఇది జరిగి కొన్ని నెలలు గడిచాయి. ప్రస్తుత ఎన్నికల్లో భాజపా ఓటమే లక్ష్యంగా ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడే రాజకీయ పార్టీలకు మద్దతిస్తామంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ముందుకొచ్చారు. అదే లక్ష్యంతో బెంగాల్‌లో మమతకు పూర్తి మద్దతు ప్రకటించారు. మరి కాంగ్రెస్‌ గురించి ప్రస్తావిస్తే ‘అది బిహార్‌ వరకే’ అంటూ సమాధానం ఇవ్వడం గమనార్హం. మళ్లీ ఇదే ఆర్జేడీ అసోంలో కాంగ్రెస్‌తో చేతులు కలుపుతోంది. హిందీ ఓటర్లే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ సైతం మమతకు మద్దతుగా ప్రచారం చేస్తామని ప్రకటించారు. గతంలో కాంగ్రెస్‌తో కలిసి ఈ పార్టీ యూపీలో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఒక పార్టీని ఓడించడం కోసమో.. ఇంకో పార్టీని అందలమెక్కించడం కోసమో పార్టీలు ఇలాంటి కొత్త వ్యూహాలు అనుసరిస్తున్నా.. ఏదైనా అంశంపై జాతీయ స్థాయిలో ఏకతాటిపైకి వచ్చేటప్పుడు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని