Congress: సింధియా.. 24 క్యారెట్‌ మోసగాడు: జైరాం రమేశ్‌

గౌరవప్రదంగా పార్టీ నుంచి వైదొలగిన నాయకులు తిరిగి చేరాలనుకుంటే స్వాగతిస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కమ్యూనికేషన్స్‌ వ్యవహారాల చీఫ్ జైరాం రమేశ్‌ అన్నారు. అయితే, జ్యోతిరాదిత్య సింధియా, హిమంత్‌ బిశ్వశర్మ లాంటి వారు ఆ అవకాశాన్ని కోల్పోయారన్నారు.

Published : 03 Dec 2022 01:16 IST

భోపాల్‌:  గౌరవప్రదంగా పార్టీ నుంచి వైదొలగిన నాయకులు తిరిగి చేరాలనుకుంటే స్వాగతిస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కమ్యూనికేషన్స్‌ వ్యవహారాల చీఫ్ జైరాం రమేశ్‌ అన్నారు. బయటకి వెళ్లినా పార్టీని విమర్శించకుండా మౌనంగా ఉన్న కపిల్‌ సిబల్‌ లాంటి నాయకులకు పార్టీ ఎల్లప్పుడూ ద్వారాలు తెరిచే ఉంచుతుందన్నారు. అయితే, జ్యోతిరాదిత్య సింధియా, హిమంత్‌ బిశ్వశర్మలాంటి నాయకులు మాత్రం ఆ అవకాశాన్ని కోల్పోయారని విమర్శించారు. మధ్యప్రదేశ్‌లోని భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. సాధారణంగా పార్టీని వీడిన వారికి కాంగ్రెస్‌ తిరిగి చేర్చుకోదని, అయితే కపిల్‌సిబల్‌ లాంటి నాయకులు వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడినప్పటికీ.. పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించలేదని అన్నారు. అలాంటి వారికి పార్టీ మరో అవకాశాన్ని ఇస్తుందన్నారు.

గతంలో కాంగ్రెస్‌లో కొనసాగిన జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడిన తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షపదవో, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవో, రాజ్యసభ సీటో కాంగ్రెస్‌ కేటాయించి ఉంటే సింధియా పార్టీని వీడేవారా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘సింధియా ఓ 24 క్యారెట్‌ మోసగాడు..కేవలం పదవుల కోసం పార్టీని వీడిన పక్కా మోసగాడు’’ అని జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు. జైరాం రమేశ్‌ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్‌ భాజపా కార్యదర్శి రజ్‌నీశ్‌ అగర్వాల్‌ స్పందించారు. ‘సింధియా, హిమంత్‌ బిశ్వ శర్మ.. బలమైన సాంస్కృతిక మూలాలు కలిగిన 24 క్యారెట్‌ దేశభక్తులు’ అని అన్నారు. పార్టీని నడిపే సామర్థ్యం రాహుల్ గాంధీకి లేదని ఆరోపిస్తూ.. హిమంత్‌ బిశ్వశర్మ 2015లో హస్తం పార్టీని వీడి భాజపాలో చేరిపోయారు. అనంతరం కేంద్ర మంత్రిగా, ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్‌లో కీలక నాయకుడిగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా 2020లో కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. అనంతరం భాజపా అతడికి మంత్రి పదవి ఇచ్చింది. పౌరవిమానశాఖ మంత్రిగా ఆయన సేవలందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని