Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి భద్రత కుదింపు

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy) భద్రతను అధికారులు కుదించారు. భద్రత సిబ్బందిని 2+2 నుంచి 1+1కి తగ్గించారు.

Published : 05 Feb 2023 01:21 IST

అమరావతి: నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి భద్రతను అధికారులు కుదించారు. భద్రతా సిబ్బందిని 2+2 నుంచి 1+1కి తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన పత్రంపై కోటంరెడ్డి సంతకం చేశారు. ఇటీవల వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి కూడా పోలీసులు భద్రతను తగ్గించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ పార్టీ వీడేందుకు సిద్ధమైన నేపథ్యంలోనే భద్రత కుదించినట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా సొంత పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదన్న కారణంతో పార్టీ నుంచి దూరంగా జరగాలని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే, పార్టీకి చెందిన 13 మంది మంత్రులు, సలహాదారులు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు తన వ్యక్తిత్వాన్ని అనుమానించే రీతిలో మాట్లాడుతుంటే తప్పని పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తోందని రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అన్నారు. అంతేకాకుండా వైకాపా నేతలు తన ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపించిన కోటంరెడ్డి.. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా బయటపెడతానని అన్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్‌(CM Jagan), సజ్జల రామకృష్ణారెడ్డి, తదితర పార్టీ పెద్దల జోలికొస్తే.. నడివీధిలో ఈడ్చుకుంటూ వెళ్తానంటూ కడపకు చెందిన బోరుగడ్డ అనిల్‌ అనే వ్యక్తి కోటంరెడ్డిని బెదిరించడం చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో ఆయన భద్రతను కూడా పోలీసులు కుదించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని