Ap News: వంగవీటి రాధాకు 2 ప్లస్‌ 2 గన్‌మెన్ల భద్రత.. సీఎం ఆదేశం

తనను చంపేందుకు కొందరు రెక్కీ నిర్వహించారంటూ మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి......

Published : 28 Dec 2021 01:24 IST

అమరావతి: తనను చంపేందుకు కొందరు రెక్కీ నిర్వహించారంటూ మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని సీఎం జగన్‌ను కలిసి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ.. రాధాకు 2 ప్లస్‌ 2 గన్‌మెన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. వెంటనే భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్‌ డీజీకి ఆదేశించారన్నారు. రాధాపై ఎవరు రెక్కీ చేశారో దర్యాప్తు జరపాలని ఆదేశించారని తెలిపారు.

వైకాపాలోకి వస్తానని రాధా చెప్పలేదు.. తామూ రమ్మనలేదని నాని ఈ సందర్భంగా స్పష్టంచేశారు. ఆయన వైకాపాలోకి వస్తానంటే అప్పుడే సీఎంతో మాట్లాడతామని చెప్పారు. పిలిస్తేనే రంగా విగ్రహావిష్కరణకు వెళ్లాం తప్ప అంతకంటే మరేంలేదన్నారు. సినిమా టికెట్ల వ్యవహారంపైనా నాని స్పందించారు. రాష్ట్రంలో గతంలో ఉన్న సినిమా టికెట్‌ ధరలే ఇప్పుడూ ఉన్నాయని, తాము ఎక్కడా తగ్గించలేదని చెప్పారు. టికెట్‌ ధర పెంచి దోచుకొనేందుకు తాము అవకాశం కల్పించలేదని తెలిపారు. కమిటీ వేసి టికెట్‌ ధర పెంచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ప్రభుత్వ చర్యల వల్ల ఎగ్జిబిటర్లకు ఎలాంటి నష్టంలేదన్నారు. రాష్ట్రంలో లక్ష సీట్లు ఉంటే.. అందులో వెయ్యి సీట్లకూ రూ.10 టికెట్‌ ఉండదన్నారు. కొందరు కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష సాధింపు లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని