NCP: శరద్‌ పవార్‌కు మరో షాక్‌.. అజిత్‌ బాటలోనే నాగాలాండ్‌ ఎమ్మెల్యేలు

నాగాలాండ్‌లో ఎన్సీపీ నుంచి గెలుపొందిన ఏడుగురు ఎమ్మెల్యేలు అజిత్‌ పవార్‌ వర్గానికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. 

Updated : 22 Jul 2023 11:40 IST

దిల్లీ: ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌(Sharad pawar)కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌ నుంచి ఎన్సీపీ(NCP) తరఫున గెలుపొందిన ఏడుగురు ఎమ్మెల్యేలు తమ పూర్తి మద్దతును అజిత్‌ పవార్‌(Ajit Pawar)కు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటికే మహారాష్ట్ర ఎన్సీపీలో తిరుగుబాటును చవిచూసిన శరద్‌ పవార్‌కు ఈ నిర్ణయం శరాఘాతంగా మారింది.

ఈ నెల ప్రారంభంలో శరద్‌పవార్‌ సోదరుడి కుమారుడు, ఎన్సీపీ కీలక నేత అజిత్‌ పవార్‌ పార్టీని నిలువునా చీల్చిన సంగతి తెలిసిందే. 8మంది ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి శిందే నేతృత్వంలోని శివసేన-భాజపా కూటమిలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ నుంచి వచ్చిన 8మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, అజిత్‌ పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో నాగాలాండ్‌ ఎమ్మెల్యేలు కూడా అజిత్‌కే మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. నిజమైన ఎన్సీపీ ఎవరిది? అనే ప్రశ్న తలెత్తినప్పుడు ఈ ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు కీలకం కానుంది.

మరోవైపు, పార్టీపై తిరుగుబాటు చేసిన అజిత్‌, ఆ వర్గంలోని కీలక నేతలు ఇటీవల శరద్‌ పవార్‌ను కలిశారు. దీంతో మళ్లీ వీరిద్దరూ కలుస్తారన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా అజిత్‌ వర్గంలోని నేతలు కూడా పార్టీని చీల్చవద్దని శరద్‌ పవార్‌ను కోరారు. రెండు రోజులపాటు మౌనం వహించిన శరద్‌ పవార్‌.. ఇటీవల బెంగళూరులో కాంగ్రెస్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఆ రెండు వర్గాలు మళ్లీ కలిసే పరిస్థితులు లేవని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని