Punjab politics: ‘రాజకీయాల్లో సిద్ధూ ఓ రాఖీ సావంత్‌’.. ఆప్‌ నేత వ్యాఖ్యలు.. నెటిజన్ల ఫైర్‌!

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ విమర్శలపై స్పందిస్తూ ఆప్‌ నేత రాఘవ్‌ చద్దా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Updated : 13 May 2022 15:25 IST

చండీగఢ్‌ (పంజాబ్‌): పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ విమర్శలపై స్పందిస్తూ ఆప్‌ నేత రాఘవ్‌ చద్దా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వ్యవసాయ చట్టాల విషయంలో శిరోమణి అకాలీదళ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీపై సిద్ధూ విరుచుకుపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాల విషయంలో రెండు పార్టీలూ మొసలి కన్నీరు కారుస్తూ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. దీంతో ప్రతి విమర్శలకు దిగిన రాఘవ్‌ చద్దా.. ‘పంజాబ్‌ రాజకీయాల్లో సిద్ధూ ఓ రాఖీ సావంత్‌’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

వ్యవసాయ చట్టాలు ఆమోదం పొంది ఏడాది పూర్తయిన నేపథ్యంలో శిరోమణి అకాలీదళ్‌ నేతలు సుఖ్‌బీర్‌ సింగ్‌బాదల్‌, కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ దిల్లీలో శుక్రవారం నిరసన తెలిపారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శిరోమణి అకాలీదళ్‌పై సిద్ధూ విమర్శలు గుప్పించారు. చట్టాల రూపకల్పనలో పాలుపంచుకుని ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఆరోపించారు. ‘మీ డ్రామాలు బహిర్గతం అయ్యాయి’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీపైనా సిద్ధూ విరుచుకుపడ్డారు. ఓ వైపు దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తుంటే అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం గతేడాది ఒక చట్టాన్ని నోటిఫై చేసిందని విమర్శిస్తూ ట్విటర్‌లో ఓ వీడియో సందేశాన్ని ఉంచారు. అదే ప్రభుత్వం అసెంబ్లీలో వ్యవసాయ చట్టాల ప్రతులను చింపి వేసిందన్నారు. ఇంతకీ ఆ చట్టాన్ని డీ-నోటిఫై చేశారా లేదా అంటూ ప్రశ్నించారు.

సిద్ధూ వ్యాఖ్యలపై ఆప్‌ నేత రాఘవ్‌ చద్దా ఘాటుగా స్పందించారు. ‘‘పంజాబ్‌ పాలిటిక్స్‌లో సిద్ధూ రాఖీ సావంత్‌లాంటోడు. మొన్నటి వరకు కెప్టెన్‌ అమరీందర్‌ను తిట్టారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ మందలించేసరికి ఇప్పుడు కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. మళ్లీ రేప్పొద్దున్న కెప్టెన్‌పై తిట్లదండకం అందుకుంటారు’’ అంటూ చద్దా ట్వీట్‌ చేశారు. అయితే, రాజకీయ విమర్శల్లో సినీ నటి పేరు తీసుకురావడంతో చద్దాపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘మీ రాజకీయాల్లోకి ఆమెను లాగడమెందుకు’ అని ప్రశ్నిస్తున్నారు. రాఖీసావంత్‌కు క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని