
TS News: కరీంనగర్‌లో బండి సంజయ్ దీక్ష.. భారీగా పోలీసుల మోహరింపు
కరీంనగర్: 317 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సంఘీభావంగా కరీంనగర్‌లో ఆదివారం రాత్రి ఎంపీ క్యాంపు కార్యాలయం వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాగరణ దీక్ష చేయడానికి సిద్ధమయ్యారు. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో అనుమతి లేకపోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో భాజపా కార్యకర్తలు.. పోలీసులు, సీఎం కేసీఆర్, కేటీఆర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈక్రమంలో ఎంపీ బండి సంజయ్ ద్విచక్రవాహనంపై క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు ఆయన్ను చుట్టుముట్టారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని ఆయన కార్యాలయంలోకి వెళ్లారు. ప్రస్తుతం కార్యాలయ ప్రాంగణలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు దీక్షను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. నల్గొండలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు అనుమతించిన పోలీసులు తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 317జీవో వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతోందని, సొంత జిల్లాలో కూడా పరాయి వాడిగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. జీవోను సవరించి, అందుకు అనుగుణంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. బండి సంజయ్ కార్యాలయం లోపల దీక్ష కొనసాగిస్తున్నారు. పోలీసులు భారీగా మోహరించి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్‌ను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. బండి సంజయ్ జాగరణ దీక్షకు ఎలాంటి అనుమతి కోరలేదని కరీంనగర్ సీపీ తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేనందున మీడియా కవరేజ్ ఇవ్వొద్దని సీపీ కోరారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.