TS News: అబద్ధపు పునాదులపై భాజపా లబ్ధి పొందాలనుకుంటోంది: హరీశ్‌రావు

కేంద్రంలో భాజపా ప్రభుత్వం గద్దె దిగితేనే రైతులకు మేలు జరుగుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Updated : 20 Dec 2021 14:22 IST

గజ్వేల్‌: కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం గద్దె దిగితేనే రైతులకు మేలు జరుగుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతుల ఉసురు పోసుకుంటోందని ఆక్షేపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన ధర్నాలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు.

‘‘దేశంలో మూడు రకాల ప్రభుత్వాలున్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం, రెండోది రాష్ట్ర ప్రభుత్వం, మరొకటి స్థానిక సంస్థలు. మిగతా రెండు సమర్థవంతంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పని చేయడం లేదు. అబద్ధపు పునాదుల మీద భాజపా రాజకీయం చేస్తూ తెలంగాణలో లబ్ధి పొందాలని చూస్తోంది. రాష్ట్రంలో భాజపా ఆటలు చెల్లవు. ఇక్కడ అసత్య ప్రచారాలు చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. కేంద్ర ప్రభుత్వంతో ధాన్యం కొనుగోలు చేయించాలి.

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను వివరిస్తూ తెరాస నాయకులు గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలు ఉద్ధృతం చేయాలి. అబద్ధపు ప్రచారాలు చేస్తున్న భాజపా నాయకులను రైతులు, కార్యకర్తలు తరిమికొట్టాలి. సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి. రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌ది’’ అని హరీశ్‌రావు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని