Tamil Nadu: న్యాయ పోరాటానికి సిద్ధమైన స్టాలిన్‌.. ఆయనది రెండు నాల్కల ధోరణి: భాజపా

సెంథిల్‌ బాలాజీని (Senthil Balaji) మంత్రివర్గం నుంచి తొలగించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. న్యాయనిపుణుల సలహా మేరకు గవర్నర్‌కు లేఖ రాసే యోచనలో ఉన్నారు.

Published : 30 Jun 2023 16:46 IST

చెన్నై: తమిళనాడు మంత్రి వర్గం నుంచి సెంథిల్‌ బాలాజీని (Senthil Balaji) తొలగిస్తూ గవర్నర్‌ రవి ఉత్తర్వులు జారీ చేయడం అక్కడి రాజకీయాల్లో సరికొత్త వివాదానికి తెరతీసింది. ఇప్పటికే గవర్నర్‌, ప్రభుత్వానికి మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో తాజా పరిణామాలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయి. గురువారం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే అటార్నీ జనరల్‌తో సంప్రదింపుల కోసమంటూ గవర్నర్‌ ఆ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై న్యాయపరంగా పోరాడేందుకు సీఎం స్టాలిన్‌ (Stalin) సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన సీనియర్‌ న్యాయవాది, మంత్రి తంగం తెన్నారసుతో భేటీ అయ్యారు. ఒకవేళ గవర్నర్‌ ఉత్తర్వులు జారీ చేస్తే వాటిని అడ్డుకోవడం ఎలా? అనే అంశంపై చర్చించినట్లు సమాచారం. తంగం సూచన మేరకు గవర్నర్‌కు ముఖ్యమంత్రి స్టాలిన్‌ లేఖ రాసే యోచనలో ఉన్నారు.  అంతకుముందు సచివాలయానికి చేరుకున్న తమిళనాడు అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) షణ్ముగసుందరమ్‌.. సీఎం స్టాలిన్‌, సీనియర్‌ న్యాయవాది, డీఎంకే నేత ఎలన్‌గోవ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

స్టాలిన్‌ది రెండు నాల్కల ధోరణి: భాజపా

ముఖ్యమంత్రి స్టాలిన్‌ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారని భాజపా విమర్శించింది. స్టాలిన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఏఐడీఎంకే పార్టీకి చెందిన మంత్రిని తొలగించాల్సిందిగా నాటి గవర్నర్‌ను స్టాలిన్‌ కోరారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై గుర్తు చేశారు. కాగా, తాజాగా మంత్రి సెంథిల్‌ బాలాజీని తొలగిస్తూ గవర్నర్‌ ఉత్తర్వులు జారీ చేసి, మళ్లీ వాటిని నిలుపుదల చేసినా..రాజ్యాంగ సంక్షోభం మొదలైందని హంగామా చేస్తున్నారని విమర్శించారు.

అన్నాడీఎంకే హయాంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నగదు తీసుకుని మోసం చేసిన కేసులో ఇటీవల మంత్రి సెంథిల్‌ బాలాజీ నివాసాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు చేసి ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పలు నేరాలతో సంబంధం ఉన్నందున ఆయనకు కోర్టు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి శాఖ లేని సెంథిల్‌ బాలాజీని మంత్రి మండలి నుంచి తొలగిస్తూ గవర్నర్‌ ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని