
బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే: అభిషేక్
కోల్‌కతా: పశ్చిమ్‌బంగలో నోటిఫికేషన్ వెలువడకముందే ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్ష నేతలు విమర్శలకు పదును పెడుతున్నారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని విమర్శిస్తూ భాజపా నేత సువేందు అధికారి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం నిర్వహించిన ర్యాలీలో సువేందు మాట్లాడుతూ ‘‘ దోపిడీల మేనల్లుడు’’ అంటూ పరోక్షంగా అభిషేక్‌ను విమర్శించారు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడినందుకు గానూ 36 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని అభిషేక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సువేందు అధికారికి లీగల్ నోటీసులు పంపారు.
సువేందు అధికారి పలు పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నారని, అలాంటి వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అభిషేక్ మండిపడ్డారు. నోటీసులపై సువేందు స్పందించపోతే చట్టప్రకారం ముందుకెళ్తామని అభిషేక్ తరఫు న్యాయవాది వెల్లడించారు.
ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మంత్రివర్గంలో సువేందు అధికారి కీలక పాత్ర పోషించారు. అయితే రాజకీయ కారణాల వల్ల ఇటీవలే పార్టీని వీడి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి భాజపాలో చేరుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కమలదళం, పశ్చిమ్ బంగలోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో పార్టీల మార్పిడి వ్యవహారం కీలకంగా మారింది.అంతవరకూ పార్టీకి విశ్వాసంగా వ్యవహరించిన వారే.. ఒక్కసారిగా తిరుగుబావుటా ఎగురవేయడం దీదీని ఆలోచనలో పడేస్తోంది.
ఇదీ చదవండి