Tummala: రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల

రాష్ట్రంలో వ్యవసాయ పురోగతికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Updated : 29 Mar 2024 20:03 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ పురోగతికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారినప్పటికీ రైతుల శ్రేయస్సుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రూ.2లక్షల రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. 2023-24 యాసంగికి సంబంధించి శుక్రవారం నాటికి 64,75,819 మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 92.68శాతం రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమయ్యాయని చెప్పారు. 

3 నెలల కంటే తక్కువ రోజుల్లో జమ చేయలేదు

‘‘గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క ఏడాది రైతుబంధు నిధులు 3 నెలల కంటే తక్కువ రోజుల్లో జమ చేయలేదు. 2018-19 వానాకాలంలో 4 నెలల 5 రోజులు, యాసంగిలో 5 నెలల 11 రోజులు | 2019-20 వానాకాలంలో 4 నెలల 10 రోజులు, యాసంగిలో 1 నెల 19 రోజులు |  2020-21 వానాకాలంలో 5 నెలల 16 రోజులు, యాసంగిలో 2 నెలల 24 రోజులు |  2022-23 వానాకాలంలో 2 నెలల 8 రోజులు, యాసంగిలో 4 నెలల 28 రోజులు | 2023 -24 వానాకాలంలో 3 నెలల 20 రోజులు పట్టింది. 

సగం మంది రైతులకే రుణమాఫీ

అధికారంలో ఉన్నపుడు ఏనాడూ పంట పొలాలు సందర్శించని భారాస నాయకులు ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఔటర్ రింగ్ రోడ్‌ను కుదవ పెట్టి కేవలం సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రైతులకు అన్యాయం జరిగిందని పెడబొబ్బలు పెడుతూ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న దుర్భిక్ష పరిస్థుతులను కూడా రాజకీయం చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి ఆర్‌బీఐ, బ్యాంకులతో కలిసి విధి విధానాల రూపకల్పన చేస్తున్నాం’’అని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని