Arvind Kejriwal: అర్వింద్‌ కేజ్రీవాల్‌-ఉద్ధవ్‌ ఠాక్రే భేటీ.. కీలక చర్చ?

దిల్లీ (Delhi), పంజాబ్‌ (Punjab) ముఖ్యమంత్రులు, ఆప్‌ ఎంపీలతో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) ముంబయిలో భేటీ అయ్యారు. దేశంలోని పరిస్థితులను గురించి చర్చినట్లు వెల్లడించారు.

Published : 25 Feb 2023 00:10 IST

ముంబయి: దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal), పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (Bhagvanth Mann), ఆప్‌ పార్టీ ఎంపీలతో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముంబయిలోని ఠాక్రే నివాసం మాతోశ్రీలో ఈ నేతలంతా సమావేశమై దేశంలోని పరిస్థితులను గురించి చర్చించారు. ‘‘ దేశాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ఏం చేయాలన్న అంశంపై చర్చించామని ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. దేశాభివృద్ధి విషయంలో తామందరిదీ ఒకటే భావజాలమని చెప్పారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుకున్నట్లు అర్వింద్ కేజ్రీవాల్ తెలిపారు. ‘‘ దేశంలో యువతకు సరైన ఉద్యోగాలు దొరకట్లేదు. ద్రవ్యోల్బణం అదుపుతప్పింది. ఓ వైపు ఖర్చులు పెరుగుతున్నా.. దానికి తగ్గట్లు ఆదాయం మాత్రం పెరగడం లేదు.’’ అని కేజ్రీవాల్‌ అన్నారు. కరోనా లాంటి భయంకరమైన పరిస్థితులను అప్పట్లో ఉద్ధవ్‌ ప్రభుత్వం ముంబయిలో నేర్పుతో ఎదుర్కొందని చెప్పిన కేజ్రీవాల్‌.. అదే వ్యూహాన్ని దిల్లీలోనూ అమలు చేశామని అన్నారు.

సమావేశం అనంతరం ఆప్‌ నేతలకు ధన్యవాదాలు చెబుతూ శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే  ట్విటర్‌లో పోస్టు చేశారు. ఆతిథ్యాన్ని మన్నించి తేనీరు సేవించేందుకు వచ్చిన దిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులకు, ఆప్‌ ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకు మించి సమావేశం గురించిన వివరాలను ఆప్‌గానీ, ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం గానీ వెల్లడించలేదు. మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే వర్గం కాంగ్రెస్‌తో పొత్తులో ఉంది. మరోవైపు దిల్లీ, పంజాబ్‌లో ఆప్‌ పార్టీతో కాంగ్రెస్‌కు విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రేతో ఆప్‌ నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని