Updated : 24 Jun 2022 17:48 IST

Uddhav Thackeray: మనసు విప్పి మాట్లాడుతున్నా.. సీఎం అవుతానని నేనెప్పుడు అనుకోలేదు..!

క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని నిలుపుకొనేందుకు ఠాక్రే ప్రయత్నాలు

ముంబయి: మహారాష్ట్ర(Maharashtra) రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతోంది. అసమ్మతి నేత ఏక్‌నాథ్ శిందే(Eknath Shinde) వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య 50కి పెరిగిందన్న వార్తల మధ్య క్షేత్రస్థాయిలో పార్టీని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray) ప్రయత్నాలు ప్రారంభించారు. దానిలో భాగంగా ఈ రోజు జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు. వారు పార్టీని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అసమ్మతి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే వెళ్లిపోయిన వారి గురించి తానెందుకు బాధపడతానన్నారు. శివసేన(shiv sena), ఠాక్రే పేర్లు వాడకుండా వారెలా ముందుకు వెళ్తారని ప్రశ్నించారు. అలాగే తానెప్పుడూ ముఖ్యమంత్రి పదవి గురించి కలగనలేదన్నారు. 

‘శివసేనను విడిచిపెట్టడం కంటే మరణించడం మేలని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు పారిపోయారు. వారు పార్టీని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారి గురించి నేనెందుకు బాధపడతా. శివసేన, ఠాక్రే పేరు వాడకుండా వారు ఎంతదూరం వెళ్లగలరు. శిందే తన కుమారుడిని ఎంపీని చేస్తారు. కానీ, నా బిడ్డతో ఆయనకు ఎందుకు సమస్య. నా తల, మెడ, పాదాల వరకు మొత్తం నొప్పిగా ఉంది. కొంతమంది నేనిక కోలుకోలేనుకుంటున్నారు. కానీ నేను నా గురించి ఆలోచించుకోవడం లేదు’ అంటూ ఠాక్రే ఉద్వేగంగా మాట్లాడారు. 

మనసు విప్పి మాట్లాడుతున్నా..

‘మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా మహమ్మారి దేశంలోకి అడుగుపెట్టింది. దానిని ఎలాగో తట్టుకొని ముందుకు వెళ్తుంటే.. నాకు మెడనొప్పి ప్రారంభమైంది. ఈ రోజు నేను నా మనసు విప్పి మాట్లాడుతున్నాను. నేను వర్ష(అధికారిక నివాసం) వదిలి వచ్చాను. అంటే నేను పోరాటాన్ని వదిలేసినట్లు కాదు. పదవుల పట్ల వ్యామోహం కలిగిన వ్యక్తిని కాదు. నేను ముఖ్యమంత్రిని అవుతానని ఏనాడు ఊహించలేదు’ అని అన్నారు. 

మా అమ్మ ఎంతగానో బాధపడింది: ఆదిత్య ఠాక్రే

‘మిత్రపక్షాలు వెన్నుపోటు పొడిచినా ఇంత బాధగా ఉండేది కాదని మా అమ్మ వాపోయింది. మన వల్ల ఎదిగిన మనవాళ్లు మనకు వెన్నుపోటు పొడిచారు. దానికి ఎంతగానో బాధగా ఉంది. నాన్న అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకొని వారు లాభం పొందారు’ అంటూ అసమ్మతి నేతలపై ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు. 

అస్సాంలోని గువాహటి హోటల్‌ నుంచే ఏక్‌నాథ్‌ శిందే తన బలాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పటికే ఆయన వద్ద దాదాపు 40 మంది శివసేన ఎమ్మెల్యేలున్నట్లు తెలుస్తోంది. స్వతంత్రులతో కలిసి ఆ సంఖ్య 50కి పెరిగినట్లు సమాచారం. అంతేగాకుండా 400 మంది మాజీ కార్పొరేటర్లతో కూడా శిందే వర్గం భేటీ అయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఠాక్రే కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ఉద్ధవ్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే మున్ముందు ఎంపీలు, కార్పొరేటర్లు కూడా అసమ్మతి వర్గంతో వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ ఏడాది చివర్లో జరగనున్న బీఎంసీ ఎన్నికలపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts