Khushboo: నటి గాయత్రీ రఘురామ్‌ ఆరోపణలను ఖండించిన ఖుష్బూ

భాజపాలో మహిళలకు భద్రత లేదంటూ ఇటీవల సినీనటి గాయత్రీ రఘురామ్‌ చేసిన ఆరోపణల్ని ఆ పార్టీ సీనియర్‌ నేత ఖుష్బూ సుందర్‌ ఖండించారు. మహిళలంతా తమ పార్టీని వీడటంలేదని.. తానూ ఆ పార్టీలోనే కదా ఉన్నాను అంటూ వ్యాఖ్యానించారు.

Published : 09 Jan 2023 01:12 IST

కోయంబత్తూరు: తమిళనాడు భాజపా(BJP)లో మహిళలకు గౌరవం, భద్రత లేవంటూ ఇటీవల నటి గాయత్రీ రఘురామ్‌(Gayathri Raghuramm) చేసిన ఆరోపణలను ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు ఖుష్బూ సుందర్‌ (Khushboo Sundar)ఖండించారు. ఇటీవల భాజపాకు రాజీనామా చేసిన సందర్భంగా గాయత్రి చేసిన ఆరోపణల్ని ఖండించారు. రాష్ట్రంలోని భాజపాలో మహిళలకు గౌరవం, రక్షణ ఉన్నాయన్నారు. సంక్రాంతి నేపథ్యంలో ఆదివారం వెల్లలూరులో సంప్రదాయ ఎడ్ల బండి పోటీలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. భాజపాలో మహిళలకు భద్రత ఉందన్నారు. మహిళలంతా తమ పార్టీని వీడటంలేదని, తాను కూడా ఆ పార్టీలోనే ఉన్నానని చెప్పారు. భాజపా రాష్ట్ర చీఫ్‌ అన్నామలై ధైర్యంగా, బలమైన నిర్ణయాలు తీసుకుంటూ తనకు మద్దతుగా పోరాటం చేశారని కొనియాడారు. 

రాష్ట్రాన్ని తమిళగం లేదా తమిళనాడు అని పిలిచినా తప్పులేదన్న ఖుష్బూ.. తాను ముంబయిలో పుట్టినా తమిళ మహిళనేనన్నారు. గత 36 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నానంటూ ఆమె చెప్పుకొచ్చారు. సంక్రాంతి కానుకగా చెరకు, రూ.1000లను డీఎంకే ప్రభుత్వం ఓ భిక్షలా ఇస్తోందంటూ విమర్శలు గుప్పించారు. అంతకుముందు ఎడ్లబండిపై కొద్దిదూరం పాటు ప్రయాణించిన ఖుష్బూ అందరినీ ఉత్సాహపరిచారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని