Karnataka Elections: యడియూరప్ప రేసులో ఉంటే ఫలితం మరోలా ఉండేదా?

Karnataka Elections: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో దక్షిణాదిలో అధికారం ఉన్న ఏకైక రాష్ట్రాన్ని భాజపా కోల్పోయింది. అయితే, కన్నడ సీమలో కాషాయ పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించిన యడియూరప్ప రేసులో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్న విశ్లేషణలు వినబడుతున్నాయి.

Updated : 13 May 2023 18:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం : దక్షిణాదిలో అధికారం ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక(Karnataka)లో భాజపా(BJP) పరాజయం పాలైంది. దీంతో దక్షిణాదిలో ఏ రాష్ట్రంలోనూ అధికారంలోనూ లేనట్టయింది. గత మూడు దశాబ్దాల నుంచి కర్ణాటకలో భాజపా ప్రాబల్యం బాగా విస్తరించింది. ఈ విస్తరణ వెనుక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప(Yediyurappa) కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు.

నాలుగు సార్లు సీఎంగా...

రాష్ట్రంలో భాజపాను  గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసిన యడియూరప్ప భాజపాను గణనీయ శక్తిగా రూపొందించారు. రాష్ట్రంలో బలీయమైన లింగాయత్‌ వర్గానికి చెందిన యడియూరప్ప అత్యంత జనాకర్షణ ఉన్న నేతల్లో ఒకరు. అయితే 2021లో 75 ఏళ్ల నిబంధన ప్రకారం భాజపా ఆయనను తప్పించి బస్వరాజ్‌ బొమ్మైకు పగ్గాలు అప్పగించింది. ఆయన మౌనంగా ఉన్నా ఓటర్లు, అభిమానులు మాత్రం ఈ మార్పును అంగీకరించలేదని తాజా ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి.

గతంలోనూ అనుభవమే.. 

2013 అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపా నుంచి వెళ్లిపోయిన యడియూరప్ప కర్ణాటక జనతా పక్ష అనే రాజకీయ పక్షాన్ని స్థాపించారు. ఆ ఎన్నికల్లో అధికారంలో ఉన్న భాజపా కేవలం 40 సీట్లకే పరిమితమైంది.  అనంతరం 2014లో సొంతగూటికి చేరుకున్న యడియూరప్ప నాయకత్వంలో భాజపా లోక్‌సభ ఎన్నికల్లో గణనీయ ఫలితాలు సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ  104 సీట్లు సాధించింది. 2019లో కొవిడ్‌ నియంత్రణలో విఫలమయ్యారన్న ఆరోపణలు రావడం, వయోభారం కారణంగా భాజపా అగ్రనాయకత్వం ఆయన్ను పక్కకు తప్పించి బొమ్మైకు సీఎం నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.

యాత్రల ద్వారా ఓటర్లకు చేరువై..

దాదాపు మూడు దశాబ్దాలకు పైగా కర్ణాటక రాజకీయాల్లో కీలక శక్తిగా ఉన్న యడియూరప్ప అనేక యాత్రల ద్వారా భాజపాను ప్రధాన పక్షాల్లో ఒక్కటిగా మార్చారు.  సైకిల్‌ యాత్ర, సంకల్ప్‌యాత్ర, సేవ్‌ కావేరి యాత్ర,  కిసాన్‌యాత్రలతో రాష్ట్రప్రజలకు మరింత చేరువయ్యారు. కర్ణాటకలో భాజపాకు ఆయన పెద్ద అండగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా లేకపోవడం కూడా ఓటర్లపై ప్రభావం చూపించింది.

కుమారుడికి మంత్రి పదవి లభించలేదు..

2021లో సీఎం పదవి నుంచి దిగిపోయిన అనంతరం యడియూరప్ప తన కుమారుడు విజయేంద్రకు మంత్రివర్గంలో స్థానమివ్వాలని కోరారు. అయితే ఈ ప్రయత్నం ఫలించలేదు. ఆయన ఇంకో కుమారుడు రాఘవేంద్ర శివమొగ్గ నుంచి ఎంపీగా ఉన్నారు. విజయేంద్రకు మంత్రిపదవి లభించివుంటే యడియూరప్ప అభిమానులు భాజపాకు మద్దతు పలికివుండేవారు. అయితే భాజపా ఈ అంశాన్ని పట్టించుకోలేదు. యడియూరప్ప స్థానాన్ని భర్తీచేసే రాష్ట్రనాయకుడు  భాజపాలో లేకపోవడం భాజపా విజయావకాశాలపై ప్రభావం చూపించిందని రాజకీయ విశ్లేషకులు  అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని