Yogi Adityanath: భాజపాకు ఓటెయ్యకపోతే.. యూపీ కూడా ఓ కశ్మీర్‌, బెంగాల్‌లాగే..!

ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలైంది. తొలి విడత పోలింగ్‌లో భాగంగా గురువారం 58 నియోజకవర్గాలకు ఓటింగ్‌ కొనసాగుతోంది. అయితే పోలింగ్‌కు కొద్ది

Updated : 10 Feb 2022 10:21 IST

తొలి విడత ఓటింగ్‌కు ముందు యూపీ సీఎం కీలక వ్యాఖ్యలు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలైంది. తొలి విడత పోలింగ్‌లో భాగంగా గురువారం 58 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. అయితే, పోలింగ్‌కు కొద్ది గంటల ముందు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపాకు ఓటేయ్యకుండా తప్పు చేస్తే.. ఉత్తరప్రదేశ్‌ కూడా ఓ కశ్మీర్‌, కేరళ, బెంగాల్‌లా మారుతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఆయన ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. 

‘‘నా మనసులో ఉన్న ఓ మాట చెప్పాలనుకుంటున్నా. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎన్నో అద్భుత కార్యక్రమాలు జరిగాయి. ఒకవేళ మీరు జాగ్రత్తగా లేకపోతే ఈ ఐదేళ్ల శ్రమ వృథా అవుతుంది. అప్పుడు యూపీ కూడా ఓ కశ్మీర్‌, కేరళ, బెంగాల్‌లా మారడానికి ఎంతో సమయం పట్టదు. ఈ ఐదేళ్ల నా కృషికి మీ ఓటే ఆశీర్వాదం. మీరు భయం లేకుండా స్వేచ్ఛగా జీవించడానికి కూడా మీ ఓటే ఓ గ్యారెంటీ. ఈ ఐదేళ్లలో డబుల్ ఇంజిన్‌ ప్రభుత్వంలో ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఇక్కడ ఓట్లు అడగడానికి మీ ముందుకు రాలేదు. కానీ, గత ప్రభుత్వాలు ఇవన్నీ చేయలేకపోయినందుకు వారి తరపున క్షమించమని అడగాలనుకుంటున్నా. ఇప్పుడు మీరు ఓ పెద్ద నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది’’ అని యోగి ఆ వీడియోలో ఓటర్లను కోరారు. ఈ వీడియోను భాజపా ఉత్తరప్రదేశ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

భయం నుంచి విముక్తి కలిగించేలా..

అటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ కూడా యూపీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ట్వీట్‌ చేశారు. ‘‘అన్ని భయాల నుంచి దేశానికి విముక్తి కల్పించండి. రండి ఓటేయ్యండి’’ అని రాసుకొచ్చారు. 

403 అసెంబ్లీ నియోజకవర్గాలున్న యూపీలో మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో భాగంగా గురువారం 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. 2017 ఎన్నికల్లో ఈ 58 నియోజకవర్గాల్లో 53 చోట్ల భాజపా జయకేతనం ఎగురవేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని