సిద్ధూకు జైలుశిక్ష

మూడు దశాబ్దాల కిందటి కేసులో మాజీ క్రికెటర్, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు నవజోత్‌సింగ్‌ సిద్ధూకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఓ వృద్ధుడి మరణానికి

Updated : 20 May 2022 05:48 IST

1988 నాటి.. వృద్ధుడిపై దాడి కేసులో సుప్రీంకోర్టు తీర్పు

చేయి కూడా ఆయుధంగా మారుతుందన్న ధర్మాసనం

దిల్లీ: మూడు దశాబ్దాల కిందటి కేసులో మాజీ క్రికెటర్, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు నవజోత్‌సింగ్‌ సిద్ధూకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఓ వృద్ధుడి మరణానికి కారణమైన 1988 నాటి దాడి కేసులో నిందితుడిపై తాము ‘మితిమీరిన సానుభూతి’ చూపితే.. అది న్యాయవ్యవస్థకు, ఈ వ్యవస్థపై ఉన్న ప్రజల విశ్వాసానికి హానికరంగా మారుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. ‘ఆ పరిస్థితుల్లో కోపాన్ని నియంత్రించుకోలేకపోయి ఉండవచ్చు. దాని పరిణామాలు కూడా భరించాలి కదా’ అని తెలిపింది. ఫిర్యాది కుటుంబం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను అనుమతించిన అత్యున్నత న్యాయస్థానం గతంలో ఈ కేసుకు సంబంధించి తాము జరిమానా విధించినపుడు శిక్షార్హమైన కొన్ని వాస్తవాలు మరుగునపడ్డాయని అంగీకరించింది. ఈ దాడి జరిగిన సమయంలో క్రీడాకారుడైన సిద్ధూ పాతికేళ్ల వయసులో ఉన్న విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకొంది. శారీరకంగా దృఢంగా ఉన్న వ్యక్తి తనకంటే రెట్టింపు వయసులోని వృద్ధునిపై దాడికి దిగినపుడు చేయి కూడా ఆయుధంగా మారుతుందని జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌ల ధర్మాసనం 24 పేజీల తీర్పులో వ్యాఖ్యానించింది. 

ఏం జరిగిందంటే..

1988 డిసెంబరు 27న.. సిద్ధూ, ఆయన స్నేహితుడైన రూపిందర్‌సింగ్‌ సంధూ పటియాలాలో రోడ్డు మధ్యలో జిప్సీ ఆపి ఉంచారు. ఆ మార్గంలో వచ్చిన గుర్నాంసింగ్‌ (65) వాహనాన్ని పక్కకు తీయమని పదే పదే కోరారు. ఆవేశంతో మిత్రులు ఇద్దరూ వృద్ధుణ్ని కారు నుంచి బయటకు లాగి చితకబాదారన్నది ఈ కేసులో అభియోగం. గాయపడిన గుర్నాంసింగ్‌ను ఆసుపత్రికి తరలించగా, మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సరైన సాక్ష్యాధారాలు లేవంటూ 1999లో పటియాలా జిల్లా సెషన్స్‌ కోర్టు ఈ కేసులోని నిందితులు ఇద్దరికీ హత్య ఆరోపణల నుంచి విముక్తి కల్పించింది. ఆ తర్వాత పంజాబ్, హరియాణా హైకోర్టుకు చేరిన ఈ కేసులో 2006 నాటి తీర్పు బాధితుడి పక్షాన వచ్చింది. సిద్ధూకు మూడేళ్ల జైలుశిక్ష పడింది. ఈ తీర్పును 2018 మే 15న తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఓ సీనియర్‌ సిటిజన్‌ను గాయపరిచినందుకు సిద్ధూకు రూ.వెయ్యి జరిమానా విధించింది. ఆ సమయంలో సిద్ధూ వెంట తను ఉన్నట్లు నమ్మదగ్గ సాక్ష్యాలు లేవంటూ రూపిందర్‌సింగ్‌ సంధూను కేసు నుంచి విముక్తుణ్ని చేసింది. దీనిపై అదే ఏడాది సెప్టెంబరులో గుర్నాంసింగ్‌ కుటుంబం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ పరిశీలనకు అంగీకరించిన సుప్రీంకోర్టు ఆ మేరకు మళ్లీ నోటీసులు జారీ చేసింది. 

శిరసావహిస్తా : సిద్ధూ

చండీగఢ్‌: ‘సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తా’ అంటూ పంజాబ్‌ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజోత్‌సింగ్‌ సిద్ధూ గురువారం నాటి తీర్పు అనంతరం ట్విటర్‌ ద్వారా తన స్పందన తెలియజేశారు. ద్రవ్యోల్బణ వ్యతిరేక ర్యాలీ సందర్భంగా పటియాలాలో ఏనుగుపై ఊరేగిన సిద్ధూ.. తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించి ‘నో కామెంట్స్‌’ అంటూ ఇంటికి వెళ్లిపోయారు. 

దేవుడికి కృతజ్ఞతలు : గుర్నాం సింగ్‌ కోడలు

‘బాబాజీకి (దేవుడికి) కృతజ్ఞతలు. మేము ఆయనపైనే భారం వేశాం. సుప్రీంకోర్టు తీర్పుతో సంతృప్తిగా ఉన్నాం’ అని బాధితుడు గుర్నాంసింగ్‌ కోడలు పర్వీన్‌ కౌర్, మనవడు సబ్బి సింగ్‌ వ్యాఖ్యానించారు. పటియాలా నగరానికి 5 కి.మీ.ల దూరంలోని ఘలోరి గ్రామంలో వీరి కుటుంబం నివసిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని