
T20 World Cup: శ్రీలంకపై ఆస్ట్రేలియా విజయం
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అదరగొడుతోంది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన ఆ జట్టు.. నేడు దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై గెలుపొంది రెండో విజయాన్ని నమోదు చేసింది. లంక నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని కంగారు జట్టు మూడు ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. డేవిడ్ వార్నర్ (65; 42 బంతుల్లో 10 ఫోర్లు) అర్ధశతకంతో అదరగొట్టగా.. ఆరోన్ ఫించ్ (37; 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టీవ్ స్మిత్ (28) రాణించారు. లంక బౌలర్లలో హసలంక రెండు, శనక ఒక వికెట్ తీశారు.
అదిరే ఆరంభం
లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఆసీస్ 63/0తో నిలిచింది. హసరంగ వేసిన ఏడో ఓవర్‌లో ఆరోన్ ఫించ్ క్లీన్‌బౌల్డ్ కాగా.. తొమ్మిదో ఓవర్లో మ్యాక్స్‌వెల్ (5) అవిష్క ఫెర్నాండోకు చిక్కాడు. తర్వాత వార్నర్ జోరు పెంచాడు. చమీర వేసిన 14 ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో ధాటిగా ఆడుతున్న వార్నర్‌ని 15 ఓవర్‌లో శనక వెనక్కి పంపాడు. అప్పటికీ ఆసీస్ స్కోరు 130/3గా ఉండటంతో ఆ జట్టు విజయం ఖరారైపోయింది. తర్వాత వచ్చిన మార్కస్ స్టాయినిస్ (16; 7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) బాది ఆసీస్‌కి విజయాన్ని అందించాడు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక ఆరు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. చరిత్ అసలంక (35), కుశాల్ పెరీరా (35), భానుక రాజపక్సే (33) పరుగులు చేశారు. శ్రీలంకకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ప్యాట్ కమ్మిన్స్ వేసిన మూడో ఓవర్లో ఓపెనర్ పీతమ్ నిశాంక (7) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అసలంక.. మరో ఓపెనర్ కుశాల్ పెరీరాతో కలిసి వేగంగా ఆడాడు. దీంతో పవర్ ప్లే పూర్తయ్యే సరికి శ్రీలంక స్కోరు 53/1 గా ఉంది. ధాటిగా ఆడుతున్న క్రమంలో ఆడమ్ జంపా వేసిన పదో ఓవర్లో అసలంక.. స్మిత్‌కి చిక్కి పెవిలియన్ చేరాడు. మిచెల్ స్టార్క్ వేసిన తర్వాతి ఓవర్లోనే కుశాల్ పెరీరా కూడా ఔటయ్యాడు. దీంతో శ్రీలంక స్కోరు నెమ్మదించింది. ఆ తర్వాత క్రీజులోకి అవిష్క ఫెర్నాండో (4), వానిండు హసరంగ (4), డాసున్ శనక (12) విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన భానుక రాజపక్సే వేగంగా ఆడాడు. చమిక కరుణ రత్నే (9) పరుగులు చేశాడు. దీంతో శ్రీలంక మోస్తరు స్కోరును చేయగలిగింది.
ఇవీ చదవండి
Advertisement