
ఇషాన్ కిషన్‌కు ఆ అవకాశం ఉందా?
కీపింగ్, బ్యాటింగ్ స్లాట్‌కు ప్రధాన పోటీదారుడు
ఇంటర్నెట్‌డెస్క్: రాబోయే రోజుల్లో టీమ్‌ఇండియా కీపింగ్, బ్యాటింగ్ స్లాట్‌కు ముంబయి బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ ప్రధాన పోటీదారుడని మాజీ ఛీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. ఈ ఏడాది టీ20 లీగ్‌లో ఇషాన్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. టోర్నీలో అతడు నాలుగు అర్ధ శతకాలతో మొత్తం 516 పరుగులు పూర్తి చేశాడు. దీంతో ముంబయి తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెస్కే ఇలా పేర్కొన్నాడు.
‘ఈ పాకెట్ సైజ్ డైనమైట్ ఇలా ఆడటం చాలా బాగుంది. ఈ సీజన్ అతడికి గుర్తుండిపోతుంది. జట్టు అవసరాలను బట్టి ఓపెనర్‌గా, నాలుగో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగాడు. పరిస్థితులకు తగ్గట్టు రాణించాడు. ఈ కారణాలతోనే అతడు త్వరలో టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వికెట్ కీపింగ్, బ్యాటింగ్ స్లాట్‌కు ప్రధాన పోటీదారుడిగా నిలుస్తాడు. అతడిలాగే ఆడుతుంటే జాతీయ జట్టులో అవకాశం దొరుకుతుంది’ అని ప్రసాద్ పేర్కొన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక రాసింది. ఇదిలా ఉండగా, టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిగా రిషభ్ పంత్ ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు. అయితే, కొద్ది కాలంగా అతడు ఆశించినంత మేరకు రాణించలేకపోతున్నాడు. మరోవైపు కేఎల్ రాహుల్ సైతం ఈ ఏడాది ఆరంభంలో కివీస్ పర్యటనలో మెరిశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఒకవైపు బ్యాట్స్‌మన్‌గా రాణిస్తూనే వికెట్లు కాచుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇషాన్ ఎలా నెట్టుకొస్తాడో చూడాలి.