అజ్జూ భార్యను అలా అనేసరికి ఇంజమామ్‌ కోపంతో..

పాకిస్థాన్‌ మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ఒకానొక సందర్భంలో ఓ భారత అభిమానిని బ్యాట్‌తో కొట్టబోయాడని, అది కూడా అజహరుద్దీన్‌ భార్యను ఏదో అనడంతో...

Published : 19 Jul 2020 01:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ఒకానొక సందర్భంలో ఓ భారత అభిమానిని బ్యాట్‌తో కొట్టబోయాడని, అది కూడా అజహరుద్దీన్‌ భార్యను ఏదో అనడంతో అలా చేశాడని ఆ జట్టు దిగ్గజ బౌలర్‌ వకార్‌ యూనిస్‌ చెప్పాడు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన వకార్‌ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడిస్తూ ఇరు జట్ల మధ్య ఎలాంటి అనుబంధం ఉండేదో వివరించాడు. భారత్‌-పాక్‌ ఆటగాళ్లు మైదానంలో మాత్రమే పోరాడేవాళ్లని, బయట మాత్రం చాలా స్నేహపూర్వకంగా మెలిగేవారని తెలిపాడు. ఈ క్రమంలోనే 1997 సహారా కప్‌ సందర్భంగా ఓ భారత అభిమాని ఇంజమామ్‌ను రెచ్చగొట్టాడని, దాంతో అతడిని కొట్టబోయాడని వెల్లడించాడు.

‘మ్యాచ్‌ మధ్యలో ఇంజమామ్‌ను ఎవరో ఆలూ అంటూ కామెంట్‌ చేశారు. అయినా అది పట్టించుకోలేదు. తర్వాత ఎవరో అజహరుద్దీన్‌ భార్యపై చెడుగా మాట్లాడారు. దాంతో కోపోద్రిక్తుడైన అతను 12వ ఆటగాడిని ఒక బ్యాట్‌ తీసుకురమ్మని చెప్పాడు. ఆ బ్యాట్‌ తీసుకొని మైదానం లోంచి వెళ్లి స్టాండ్స్‌లో కూర్చున్న ఒక వ్యక్తిని పట్టుకొని వచ్చాడు. అలా చేసినందుకు ఇంజమామ్‌ రెండు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొన్నాడు. తర్వాత అది కోర్టు దాకా వెళ్లింది. దాంతో ఇంజమామ్‌ బాధపడి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి అజహరుద్దీన్‌ జోక్యం చేసుకొని ఆ అభిమానితో మాట్లాడాడు. దాంతో అతడు ఆ వివాదం నుంచి బయటపడ్డాడు. భారత్‌, పాక్‌ ఆటగాళ్లు మైదానంలో ఎంత పోరాడినా బయట మాత్రం ఒకరికి ఒకరు అండగా ఉంటారు. ఇరు జట్ల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది’ అని వకార్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని