
నా విజయాలతో అతడు గర్వపడేలా చేస్తా : ఒసాకా
ఇంటర్నెట్‌డెస్క్: ఇటీవల హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజ ఆటగాడు కోబ్ బ్రియంట్‌ను తన విజయాలతో గర్వపడేలా చేస్తానని యూఎస్ ఓపెన్ 2020 మహిళల సింగిల్స్ విభాగం విజేత నవోమీ ఒసాకా అన్నారు. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి అయిన ఒసాకా.. బెలారస్‌కు చెందిన విక్టోరియా అజెరెంకాపై 1-6, 6-3, 6-3 తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ సాధించగా రెండో యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ దివంగత బాస్కెట్‌బాల్ ప్లేయర్ కోబ్ బ్రియంట్‌ను గుర్తుచేసుకున్నారు.
‘నేను చేయాల్సిన పనులు కొన్ని మిగిలి ఉన్నాయి. వాటితో బ్రియంట్‌ను గర్వపడేలా చేస్తానని అనుకుంటున్నా. అతడి స్ఫూర్తిని అలాగే కొనసాగించాలని ఉంది. అలాగే ఎంతో మంది క్రీడాకారులకు అతడు ప్రేరణగా నిలవడం అద్భుతం. అతడి గురించి మాట్లాడితే ప్రతీ ఒక్కరూ మంచి విషయాలే చెబుతారు. నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నా. బ్రియంట్ కూడా నా నుంచి అదే ఆశించాడు. నేనెంతో ఎత్తుకు ఎదుగుతానని అతడనుకున్నాడు. కాబట్టి భవిష్యత్‌లో మరింత ఎత్తుకు ఎదుగుతానని నమ్ముతున్నా. అదంతా కాలమే చూసుకుంటుంది’ అని ఒసాకా అన్నారు.
అలాగే తన అనుభవాలతో, క్వారంటైన్ సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నానని, తన పరిస్థితులు ఇతరులతో పంచుకోవడం, వారి అనుభవాలు తెలుసుకోవడం లాంటివి తనకెంతో ముఖ్యమని చెప్పారు. ఒక క్రీడాకారిణిగా క్వారంటైన్ సమయం తనకెంతో మేలు చేసిందని, మిగతా సమయంలో దృష్టి సారించలేని విషయాలను ఇప్పుడు నేర్చుకోగలిగినట్లు అన్నారు. ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారడానికి ఇదెంతో తోడ్పడిందని వివరించారు. కాగా, 2018లో తొలిసారి యూఎస్ ఓపెన్ గెలుపొందిన ఒసాకా 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుపొందింది. ఇప్పుడు కెరీర్‌లో మూడో గ్రాండ్ స్లామ్‌తో పాటు రెండోసారి ఈ టైటిల్‌ను అందిపుచ్చుకుంది.