Paralympics: 18 ఏళ్లకే పతకం.. హైజంప్‌లో అదరగొట్టిన ప్రవీణ్‌

పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. పురుషుల హైజంప్‌లో

Updated : 03 Sep 2021 09:54 IST

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. పురుషుల హైజంప్‌లో ప్రవీణ్‌కుమార్‌ రజత పతకం సాధించాడు. దీంతో భారత్‌ సాధించిన పతకాల సంఖ్య 11కు చేరింది. మరోవైపు రజతం సాధించిన ప్రవీణ్‌కుమార్‌కు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ప్రవీణ్‌ కృషి, పట్టుదలకు నిదర్శనమే ఈ పతకమని చెప్పారు. ఈ మేరకు మోదీ ట్వీట్‌ చేశారు.

శుక్రవారం జరిగిన టి64 హైజంప్‌లో ప్రవీణ్‌ కుమార్‌ అద్భుతం చేశాడు. పారాలింపిక్స్‌ అరంగేట్రంలోనే పతకం సాధించాడు. 2.07 మీటర్లు గెంతి సరికొత్త ఆసియా రికార్డు సృష్టించాడు. స్వర్ణం అందుకున్న జొనాథన్‌ బ్రూమ్‌ ఎడ్వర్డ్స్‌ 2.10 మీటర్లు గెంతడం గమనార్హం. కాగా భారత బృందంలో అత్యంత పిన్న వయసులోనే పతకం అందుకున్నది కుమారే (18 ఏళ్లు) కావడం ప్రత్యేకం.

ప్రవీణ్‌ కుమార్‌ అత్యుత్తమ ప్రదర్శన ఇదే. నోయిడాకు చెందిన అతడు 2019లో ఈ క్రీడలో అడుగుపెట్టాడు. అదే ఏడాది జూనియర్‌ పారా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం ముద్దాడాడు.  కొన్నేళ్లుగా అతడు జాతీయ కోచ్‌ సత్యపాల్‌ సింగ్‌ నేతృత్వంలో శిక్షణ తీసుకుంటున్నాడు. బాల్యం నుంచి అతడు సాధారణ అథ్లెట్లతోనే పోటీపడటం గమనార్హం.

మోదీ ప్రశంసలు

అద్భుత ప్రదర్శన చేసిన ప్రవీణ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అతడి అంకితభావం, పట్టుదలకు ఈ పతకం నిదర్శనమని పొగిడారు. ‘పారాలింపిక్స్‌లో రజతం గెలిచిన ప్రవీణ్‌ను చూసి గర్విస్తున్నాను. అతడి అకుంఠిత దీక్ష, అంకితభావం, శ్రమకు ఈ పతకమే నిదర్శనం. అతడికి అభినందనలు. మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని