
INDvsENG: మయాంక్ అగర్వాల్ తలకు గాయం.. తొలి టెస్టుకు దూరం
నాటింగ్‌హామ్: టీమ్‌ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తలకు గాయమైంది. మరో రెండు రోజుల్లో ఇంగ్లాండ్‌తో ప్రారంభంకానున్న ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు అతడు గాయపడ్డాడు. దాంతో తొలి టెస్టుకు ఆడటం లేదని బీసీసీఐ కొద్దిసేపటి క్రితం ట్విటర్ వేదికగా అభిమానులకు సమాచారం అందజేసింది. సోమవారం ట్రెయినింగ్ సెషన్‌లో భాగంగా మహ్మద్ సిరాజ్ వేసిన ఓ షార్ట్‌పిచ్ బంతి.. అతడి తలపై భాగంలో తగిలి గాయపడ్డాడు. హెల్మెట్ తీసిన తర్వాత కొద్దిగా ఇబ్బందులు పడ్డాడు. దాంతో మయాంక్ ప్రాక్టీస్ చేయకుండానే వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా ఫిజియో నితిన్ పటేల్ అతడిని పర్యవేక్షిస్తున్నాడని వైస్ కెప్టెన్ అజింక్య రహానె మీడియాకు వెల్లడించాడు. మయాంక్ కంకషన్‌కు గురవడంతో తొలి టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. మరోవైపు అతడు మినహా మిగతా ఆటగాళ్లందరూ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నారని రహానె చెప్పాడు. కాగా, తొలి టెస్టులో మయాంక్ ఆడకపోతే కేఎల్ రాహుల్ లేదా హనుమ విహారీ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. వీరిద్దరూ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెనే అయినా పరిస్థితులకు తగ్గట్టు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల సమర్థులు.