Ashwin - Kumble: రికార్డులు బద్దలు.. అశ్విన్‌పై కుంబ్లే స్పెషల్‌ ట్వీట్

క్రికెట్‌లో ఒకరి రికార్డులను మరొకరు బద్దలు కొట్టడం సహజం. రికార్డులు సృష్టించిన క్రికెటర్లను క్రీడాస్ఫూర్తితో మెచ్చుకోవాలి. ఇప్పుడు టీమ్‌ఇండియా క్రికెట్‌ దిగ్గజం అనిల్ కుంబ్లే చేసిందదే.. అశ్విన్‌ (Ashwin) తన రెండు రికార్డులను బద్దలు కొట్టడటంతో ప్రత్యేకంగా అభినందించాడు.

Updated : 12 Mar 2023 11:21 IST

ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy)లో టీమ్‌ఇండియా టాప్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) అదరగొట్టేస్తున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా నాలుగో టెస్టులోనూ (IND vs AUS) అశ్విన్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలో క్రికెట్‌ దిగ్గజం అనిల్ కుంబ్లేకు చెందిన రెండు రికార్డులను అశ్విన్‌ అధిగమించాడు. దీంతో క్రికెట్‌ ప్రపంచమంతా అశ్విన్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. తాజాగా అనిల్ కుంబ్లే కూడా స్పందించాడు. ‘‘అశ్విన్‌ది అద్భుతమైన బౌలింగ్‌. అతడో క్లాసిక్‌ ప్లేయర్’’ అనే అర్థం వచ్చేలా ట్వీట్‌ చేశాడు.

ఆసీస్‌పై నాలుగో టెస్టులో 91 పరుగులకు అశ్విన్‌ ఆరు వికెట్లు తీశాడు. దీంతో బోర్డర్ - గావస్కర్‌ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ అవతరించాడు. ఇప్పటి వరకు అశ్విన్ 113 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌ బౌలర్‌గా అనిల్ కుంబ్లే (111) పేరిట ఉన్న ఈ రికార్డును అశ్విన్‌ అధిగమించాడు. అలాగే ఒకే ఇన్నింగ్స్‌లో 5 అంతకంటే ఎక్కువ వికెట్లను స్వదేశం వేదికగా 26వ సారి అశ్విన్‌ పడగొట్టాడు. ఇందులోనూ అనిల్‌ కుంబ్లేను అధిగమించాడు. అయితే, అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్‌ (473) 9వ బౌలర్‌గా ఉన్నాడు. అనిల్ కుంబ్లే (619) ఐదో స్థానంలో ఉన్నాడు. నాలుగో టెస్టులో నాలుగో రోజు ఆట కొనసాగుతోంది. ఆసీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. 

ఆసీస్‌తో నాలుగో టెస్టు: భారత్ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 341/4 (125)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని