Shikhar Dhawan : గబ్బర్‌కి 36 ఏళ్లోచ్చినా.. కుర్రాడిలా ఫిట్‌గా ఉన్నాడు : హర్భజన్‌ సింగ్‌

చాలా కాలం తర్వాత టీమ్ఇండియాలోకి పునరాగమనం చేసిన సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌పై మాజీ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. అతడికి వయసు మీద పడుతున్నా.. ఇంకా...

Published : 27 Jan 2022 17:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా కాలం తర్వాత టీమ్ఇండియాలోకి పునరాగమనం చేసిన సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌పై మాజీ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. అతడికి వయసు మీద పడుతున్నా.. ఇంకా కుర్రాడిలా ఫిట్‌గా ఉన్నాడని అన్నాడు. ఫామ్‌లేమి కారణంగా భారత జట్టుకు దూరమైన ధావన్‌.. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఘనంగా పునరాగమనం చేశాడు. ఆడిన మూడు మ్యాచుల్లో వరుసగా 79, 29, 61 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. త్వరలో వెస్టిండీస్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌లోనూ ధావన్‌ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. 

‘దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత సీనియర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ మునుపటి ఫామ్‌ అందుకోవడం చాలా సంతోషకరం. ధావన్‌ ఆట పట్ల అంకితభావమున్న ఆటగాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి అతడి కన్నా మెరుగ్గా రాణిస్తున్న యువ ఆటగాళ్లెవరైనా ఉన్నారా? చాలా కాలం తర్వాత దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రెండు అర్ధ శతకాలతో ధావన్‌ సత్తా చాటాడు. భారత్‌ వన్డే సిరీస్‌ కోల్పోయి ఉండొచ్చు. కానీ, తన పాత్రకు మాత్రం ధావన్ న్యాయం చేశాడు. కొద్ది మంది ఆటగాళ్ల విషయంలోనే ఎందుకు వయసును పరిగణనలోకి తీసుకుంటారో అర్థం కావడం లేదు. 40 ఏళ్ల వయసులోనూ ప్రపంచకప్‌లో ఆడిన ఆటగాళ్లున్నారు. ప్రస్తుతం ధావన్‌ వయసు 36. అయినా 23 ఏళ్ల ఇషాన్‌ కిషన్‌లా ఫిట్‌గా ఉన్నాడు. ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ.. మెరుగ్గా రాణిస్తున్నంత కాలం ఏ ఆటగాడికైనా అవకాశాలివ్వాలి. వయసు మీదపడుతుందనే కారణంతో పక్కన పెట్టడం సరికాదు. క్రికెట్లోకి పునరాగమనంతో తనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందనే విషయాన్ని ధావన్‌ మరోసారి నిరూపించుకున్నాడు’ అని హర్భజన్‌ పేర్కొన్నాడు. 

2023 వన్డే ప్రపంచకప్‌ దృష్ట్యా జట్టు యాజమాన్యం ఇప్పటి నుంచే ఆటగాళ్లను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. టీమ్‌ఇండియా ఓపెనింగ్‌ స్థానానికి తీవ్ర పోటీ ఉంది. యువ ఆటగాళ్లకు అవకాశాలు దక్కినా.. రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ జోడీ స్థాయిలో నిలకడగా రాణించలేకపోతున్నారు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా వచ్చే ప్రపంచకప్‌ వరకు ధావన్‌కి అవకాశాలివ్వాలనేది విశ్లేషకుల మాట! ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్‌ పరాజయం పాలైనప్పటికీ పలువురు యువ ఆటగాళ్లు మెరుగ్గా రాణించారు. నామమాత్రమైన మూడో వన్డేలో యువ బౌలర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ (3/59) వికెట్లతో ఆకట్టుకోగా.. దీపక్‌ చాహర్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేశాడు. రెండు వికెట్లు సహా 54 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన సూర్యకుమార్‌ యాదవ్‌ (39: 32 బంతుల్లో) మెరుగ్గా రాణించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని