Ravichandran Ashwin: అశ్విన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆసీస్‌ ‘డూప్లికేట్‌’ వ్యూహం!

నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం (IND vs AUS) భారత్‌ పర్యటనకు ఆస్ట్రేలియా వచ్చింది. బెంగళూరు వేదికగా ప్రాక్టీస్‌ సెషన్‌ను షురూ చేసింది. ఈ క్రమంలో ఆసీస్‌ కోచింగ్‌ స్టాఫ్‌ తీసుకొన్న నిర్ణయం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

Updated : 03 Feb 2023 17:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఫిబ్రవరి 9వ తేదీ నుంచి భారత్ - ఆస్ట్రేలియా జట్ల (IND vs AUS) మధ్య టెస్టు సిరీస్‌ ప్రారంభంకానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు (WTC) చేరుకోవడానికి ఇరు జట్లకూ ఇది కీలకం కానుంది. భారత్‌ (Team India) అనగానే స్పిన్‌ పిచ్‌లే ప్రత్యర్థులకు ఎదురవుతాయి. టీమ్‌ఇండియా టాప్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ (Ashwin) నుంచి ఆసీస్‌కు ఇబ్బందులు తప్పవు. భారత పిచ్‌లపై అశ్విన్‌ చాలా ప్రమాదకరమైన బౌలర్‌ అని పర్యాటక జట్టుకు బాగా తెలుసు. ఈ క్రమంలో ఆసీస్‌ కూడా అతడిని ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే భారత్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రాక్టీస్‌ చేసేందుకు అశ్విన్‌ బౌలింగ్‌ తరహా ‘డూప్లికేట్’ బౌలర్‌ను కూడా బెంగళూరులోని తమ శిబిరానికి రప్పించుకొన్నట్లు తెలుస్తోంది.

మహేశ్ పితియా అనే యువ బౌలర్ అచ్చం అశ్విన్‌ మాదిరిగానే బంతులను సంధించడం సోషల్‌ మీడియాలో ఆసీస్ కోచింగ్ బృందం చూసింది. దీంతో వెంటనే అతడిని బెంగళూరుకు రప్పించినట్లు సమాచారం. అశ్విన్‌ వేసే ఫ్లైటెడ్‌ డెలివరీలను ఆసీస్‌ బ్యాటర్లు ప్రాక్టీస్‌ చేసేందుకు మహేశ్‌ను నెట్‌బౌలర్‌గా ఎంపిక చేసుకొన్నారు. బెంగళూరులోనే ఆసీస్‌కు నాలుగు రోజుల ట్రైనింగ్‌ క్యాంప్‌ను బీసీసీఐ ఏర్పాటు చేసింది. గతేడాది డిసెంబర్‌లో బరోడా జట్టు తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన 21 ఏళ్ల  పితియా బౌలింగ్‌ యాక్షన్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. దీంతో ఆసీస్ జట్టు ఇతడి బౌలింగ్‌లో ప్రాక్టీస్‌ చేయడం వల్ల అశ్విన్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి వీలు కలుగుతుందని భావిస్తోంది. ఫిబ్రవరి 9న నాగ్‌పుర్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని