Harshal Patel: హర్షల్‌.. స్లో బంతులను అలా వేయొద్దు: సంజయ్‌ బంగర్‌

టీ20 ప్రపంచకప్‌లో ‘డెత్’ ఓవర్లలో కీలకంగా మారతాడని భావిస్తోన్న హర్షల్‌ పటేల్‌ కూడా భారీగానే పరుగులు సమర్పించుకొంటున్నాడు. అయితే అతడికి టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ పలు సూచనలు చేశాడు.

Published : 04 Oct 2022 21:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా బౌలర్‌ హర్షల్‌ పటేల్ ఇప్పటి వరకు ఆడిన 20 అంతర్జాతీయ టీ20ల్లో 26 వికెట్లు పడగొట్టాడు. అయితే తన ఎకానమీ రేటు మాత్రం దాదాపు తొమ్మిది (8.33) ఉండటం గమనార్హం. డెత్‌ ఓవర్లలో ఎక్కువగా బౌలింగ్‌ చేస్తున్నా ఈ మాత్రం ఎకానమీ రేటును కొనసాగించడం అద్భుతమనే చెప్పాలి. అంతకుముందు భారత టీ20 లీగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో జాతీయ జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. అయితే తాజాగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రెండో టీ20లో భారీగా పరుగులు సమర్పించుకొన్నాడు. ‘డెత్‌’ స్పెషలిస్ట్‌గా పేరొందిన హర్షల్‌ కూడా చివర్లో ఎక్కువగా పరుగులు ఇవ్వడం కలవరపెడుతోంది. పొట్టి ప్రపంచకప్‌లో బుమ్రా గైర్హాజరీలో హర్షల్‌ ఆ పాత్ర పోషించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో హర్షల్‌కు టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్ కొన్ని సూచనలు చేశాడు. 

‘‘హర్షల్‌ పటేల్ డెత్‌ ఓవర్లలో తక్కువ స్పీడ్‌తో వేసే బంతులను సరైన ప్రాంతంలో సంధించాలి. బ్యాటర్‌కు దగ్గరగా ఉండే నాలుగు మీటర్ల మార్క్‌కు బదులు.. గత పది మ్యాచుల్లో 7 మీటర్ల మార్క్‌ వద్ద వేయడంతో బ్యాటర్‌కు సమయం బాగా దొరికేది. దీంతో షాట్లు ఆడేందుకు అవకాశం కలిగింది. అందుకే హర్షల్‌కు నేను ప్రధానంగా సూచించే అంశం ఒక్కటే.. స్లో బంతులను పూర్తిస్థాయి ఫుల్లర్‌గా వేయాలి. అప్పుడు బ్యాటర్‌ క్యాచ్‌ ఔట్ అయ్యే ప్రమాదం ఉంటుంది’’ అని బంగర్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని