INDvsPAK: పాక్‌తో మ్యాచ్‌ అంటే ఒత్తిడి సహజం!

రాబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ జట్లు మరోసారి తలపడనున్నాయి. తాజాగా ఐసీసీ గ్రూప్‌ దశలో ఏయే జట్లు పోటీపడుతున్నాయనే వివరాలు ప్రకటించడంతో ఈ విషయం తేటతెల్లమైంది...

Published : 17 Jul 2021 01:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ జట్లు మరోసారి తలపడనున్నాయి. తాజాగా ఐసీసీ గ్రూప్‌ దశలో ఏయే జట్లు పోటీపడుతున్నాయనే వివరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్‌, పాకిస్థాన్‌ గ్రూప్‌-2లో చోటు దక్కించుకోవడంతో అభిమానులు సంబరపడుతున్నారు. మరోసారి ఈ ప్రపంచకప్‌లో రసవత్తర పోరు ఖాయమని అంచనాలు పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌తో తలపడటంపై స్పందించిన టీమ్‌ఇండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌.. పాక్‌తో మ్యాచ్‌ అంటే ఎప్పుడూ ఉత్సాహం, ఒత్తిడి ఉంటుందని చెప్పాడు.

‘‘పాక్‌తో క్రికెట్‌ ఆడటం ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఆ మ్యాచ్‌లు ఎంతో ఒత్తిడితో పాటు తీవ్ర ప్రభావం కలిగి ఉంటాయి. అయితే, మేం ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో ఏం జరుగుతుందనే దాని గురించి ఆలోచించట్లేదు. అంతకన్నా ముందు మేం ఆడాల్సింది చాలా ఉంది. మాకు శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు మరోవైపు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లు ఉన్నాయి. ఆపై ఐపీఎల్‌, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌ ఆడాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మేం ఇప్పుడే పాక్‌తో మ్యాచ్‌ గురించి ఆలోచించాలనుకోవడం లేదు. ఐపీఎల్‌ పూర్తయ్యాకే మేం అక్కడ ఎలా ఆడాలనేది ఆలోచిస్తాం’’ అని భువీ చెప్పుకొచ్చాడు. భువనేశ్వర్‌ ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న సంగతి తెలిసిందే. ఆదివారం నుంచి ఆ జట్టుతో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు ధావన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. భువీ వైస్‌ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని