WPL: చివరిమెట్టుపై ఆర్సీబీ బోల్తా.. ఒక పరుగు తేడాతో దిల్లీ విజయం

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠ పోరులో దిల్లీ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. 

Updated : 10 Mar 2024 23:42 IST

దిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)లో భాగంగా ఆర్సీబీ (RCB Women)తో జరిగిన ఉత్కంఠ పోరులో దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capital Women) కేవలం ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆర్సీబీ గెలవడానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో రిచా ఘోష్‌ (51: 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రనౌట్‌ కావడంతో దిల్లీ గెలుపొందింది. బెంగళూరు బ్యాటర్లలో ఎలిస్‌ పెర్రీ(49), సోఫీ మోలినెక్స్‌ (33), సోఫీ డివైన్‌ (26) విలువైన పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో మారిజానె కాప్‌, ఎలిస్‌ క్యాప్సీ, షిఖా పాండే, అరుంధతీ రెడ్డి తలో వికెట్‌ తీశారు.

చెలరేగిన రిచా ఘోష్.. తారాస్థాయికి ఉత్కంఠ

17 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 142 పరుగులతో నిలిచిన ఆర్సీబీ.. విజయం దిశగా వెళుతుందని ఎవరూ ఊహించలేదు. మూడో ఓవర్లలో బెంగళూరు విజయ లక్ష్యం 40 పరుగులుగా ఉంది. అప్పటికే 25 పరుగులతో ఉన్న రిచా ఘోష్‌ అనూహ్యంగా చెలరేగింది. 18వ ఓవర్‌ చివరి బంతికి సోషీ డివైన్‌ ఔట్‌ అయినప్పటికీ మిగతావారి సహకారంతో దూకుడుగా ఆడింది. 18, 19 ఓవర్లలో మొత్తం 23 పరుగులు రావడంతో చివరి ఓవర్‌ లక్ష్యం 17 పరుగులుగా మారింది. 20 ఓవర్‌ తొలి బంతికి సిక్స్‌ కొట్టిన రీచా.. రెండో బంతికి పరుగులు తీయలేదు. మూడో బంతికి పరుగు తీసే క్రమంలో దిశా కాసత్‌ రనౌట్‌ అయింది. దీంతో లక్ష్యం మూడు బంతుల్లో 10 పరుగులుగా మారింది. నాలుగో బంతికి రెండు పరుగులు తీయగా, ఐదో బంతికి రీచా మళ్లీ సిక్స్‌ కొట్టింది. సమీకరణం చివరి బంతికి రెండు పరుగులు. ఇరుజట్లతో పాటు మ్యాచ్‌ చూస్తున్న వారిలో ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. అయితే చివరి బంతికి పరుగు తీసే క్రమంలో రిచా రనౌట్‌ అవడంతో ఆర్సీబీ ఆశలు ఆవిరయ్యాయి. 

అంతకుముందు టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్లు మెగ్‌ లానింగ్‌ (29), షఫాలీ వర్మ (23) ఫర్వాలేదనిపించారు. జెమీమా రోడ్రిగ్స్‌ (58; 36 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకంతో మెరిసింది. అలీస్‌ క్యాప్సీ (48; 32 బంతుల్లో 8 ఫోర్లు) త్రుటిలో హాఫ్‌ సెంచరీ మిస్‌ చేసుకుంది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయంకా పాటిల్ నాలుగు, శోభన ఒక వికెట్ పడగొట్టారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని