T20 WORLD CUP-EOIN MORGAN: అలా అయితే జట్టు నుంచే తప్పుకొంటా: మోర్గాన్‌

ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు

Published : 21 Oct 2021 01:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ ముంగిట ఇంగ్లాండ్‌ కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన ఫామ్‌ను తిరిగి పొందలేకపోతే జట్టు నుంచి తప్పుకొనేందుకు సిద్ధమని ప్రకటించాడు. ఇంగ్లాండ్‌ టీ20 ప్రపంచకప్‌ను సాధించేందుకు తాను అడ్డంకిగా మారబోనని వ్యాఖ్యానించాడు. 35 ఏళ్ల ఇయాన్‌ మోర్గాన్‌ ఈ ఏడాది ఇంగ్లాండ్‌ తరఫున ఏడు టీ20 మ్యాచుల్లో కేవలం 82 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల ముగిసిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లోనూ పేలవ ప్రదర్శనే ఇచ్చాడు. సారథిగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఫైనల్‌కు చేర్చిన మోర్గాన్‌.. బ్యాటర్‌గా విఫలమయ్యాడు. 17 మ్యాచ్‌లకుగాను 16 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసిన ఇయాన్‌ కేవలం 133 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. సీఎస్‌కేతో జరిగిన తుదిపోరులో విఫలమయ్యాడు.

తన ఫామ్‌, కెప్టెన్సీకి సంబంధించి ఆన్‌లైన్‌లో ఇయాన్ మాట్లాడుతూ.. ‘ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ సాధించే మార్గానికి నేను అడ్డుగా ఉండను. అవసరమైతే తుది జట్టు నుంచి తప్పుకొని డగౌట్‌లో కూర్చునేందుకు వెనుకాడను. అయితే పరుగులు చేయకపోయినా.. నా సారథ్యంలో మాత్రం ఎలాంటి లోపాలు లేవు’’ అని పేర్కొన్నాడు.  ఇటీవల బ్యాటర్‌గా విఫలమవుతున్న ఇయాన్‌ మోర్గాన్‌ కెప్టెన్‌గా మాత్రం ఇంగ్లాండ్‌కు మంచి ఫలితాలను అందించాడు. 2016లో తన సారథ్యంలోనే టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు ఇంగ్లాండ్‌ వెళ్లింది. అలానే 2019 వన్డే ప్రపంచకప్‌ను అందించాడు. న్యూజిలాండ్‌తో టైగా ముగిసిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. ఇయాన్‌ మోర్గాన్‌ ఫామ్‌లో లేకపోయినా తనదైన రోజున విధ్వంసం సృష్టిస్తాడు. టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న ఇంగ్లాండ్‌ జట్టుకు అదనపు బలం మోర్గాన్‌నే. 

తుది జట్టు ఎంపిక సంక్లిష్టమే..

భారత్‌తో జరిగిన తొలి వార్మప్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఓటమిపాలైంది. ఇయాన్‌ మోర్గాన్‌ ఆడలేదు. జోస్‌ బట్లర్‌ నాయకత్వం వహించిన ఆ మ్యాచ్‌లో బ్యాటర్లు రాణించినా.. బౌలర్లు తేలిపోయారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెయిర్‌స్టో (49), మొయిన్‌ అలీ (43), లివింగ్‌ స్టోన్ (30) రాణించారు. జాసన్‌  రాయ్‌ (17), బట్లర్ (18), మలన్ (18) ఫర్వాలేదనిపించారు. అయితే టీమిండియా ఓపెనర్లు కేఎల్‌ రాహుల్ (51), ఇషాన్‌ కిషన్ (70), రిషభ్‌ పంత్‌ (29*) రాణించడంతో అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇవాళ న్యూజిలాండ్‌తో ఆఖరి వార్మప్‌ మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌ ఆడనుంది. ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యంలో తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. తొలిపోరులో వెస్టిండీస్‌తో 23న ఇంగ్లిష్‌ జట్టు తలపడనుంది. దీంతో కివీస్‌తో జరగనున్న వార్మప్‌ మ్యాచ్‌ కీలకం కానుంది. తుది జట్టు కూర్పు ఎలా చేసుకోవాలో ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని