ESA Day: ముంబయి మ్యాచ్‌.. 18 వేల మంది చిన్నారులతో నీతా అంబానీ సందడి

‘ఈఎస్‌ఏ డే’లో భాగంగా ముంబయి- దిల్లీ మ్యాచ్‌ను 18 వేల మంది చిన్నారులు వీక్షించారు. నీతా అంబానీ, సచిన్‌ తెందూల్కర్‌లు పిల్లలతో కలిసి మైదానంలో సందడి చేశారు.

Updated : 08 Apr 2024 16:58 IST

ముంబయి: ఐపీఎల్‌ (IPL) 17వ సీజన్‌లో భాగంగా ఆదివారం దిల్లీపై ముంబయి జట్టు ఘన విజయం సాధించింది. ముంబయి నగరంలోని పలు ఎన్జీవోలకు చెందిన 18 వేల మంది చిన్నారుల సమక్షంలో గెలుపొందడం ఆ జట్టుకు మరింత ఆనందాన్ని మిగిల్చింది. జట్టు యజమానురాలు నీతా అంబానీ (Nita Ambani) ఈ సందర్భంగా పిల్లలతో కలిసి వాంఖడే స్టేడియంలో సందడి చేశారు. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ముంబయి జట్టు నిర్వహించిన ‘ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ డే (ESA Day)’లో భాగంగా ఆటను వీక్షించిన ఆ చిన్నారులతో ముచ్చటించారు.

‘‘ఈ పిల్లలంతా స్టేడియంలో ఆనందాన్ని నింపారు. మా జట్టు సభ్యులూ వారి ఉత్సాహభరిత ప్రోత్సాహాన్ని ఆస్వాదించారు. క్రీడలు అనేవి ఎవరి విషయంలోనూ వివక్ష చూపవని, ప్రతిభ అనేది ఎక్కడినుంచైనా వెలుగులోకి రావచ్చని విశ్వసిస్తాను. బహుశా ఈ చిన్నారుల్లో ఒకరు భవిష్యత్తులో క్రీడల్లో అత్యున్నత స్థానానికి చేరుకోవచ్చు. చిన్నారులకు విద్యావకాశాలు, క్రీడానుభవాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకుగానూ 14 ఏళ్ల క్రితం ‘ఈఎస్‌ఏ’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 22 మిలియన్ల మంది పిల్లలను ఇందులో భాగం చేశాం. క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం వంటి అనేక విషయాలను క్రీడలు బోధిస్తాయి. గెలుపోటములను ఎలా తీసుకోవాలో నేర్పుతాయి. ఈ పిల్లలంతా ఇక్కడి నుంచి అనేక మరపురాని జ్ఞాపకాలను, తమ స్వప్నాలను సాకారం చేసుకోవాలన్న ఆకాంక్షలను మూటగట్టుకుని వెళ్తారని ఆశిస్తున్నా’’ అని నీతా అంబానీ తెలిపారు.

బోణీ కొట్టిన ముంబయి.. గెలుపు సంబరాలు చూశారా!

మొదటిసారి స్టేడియంను సందర్శించినప్పటి జ్ఞాపకాలను లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. జీవితాన్ని మార్చే అనుభవాలను చిన్నారులకు అందిస్తోన్న నీతా అంబానీ ప్రయత్నాన్ని ప్రశంసించారు. ‘‘నా దృష్టిలో.. పిల్లలే భవిష్యత్తు. వారికోసం సరైన నిర్ణయాలు తీసుకోవడం అవసరం. నీతా అంబానీ మార్గదర్శకత్వంలో రిలయన్స్‌ ఫౌండేషన్‌.. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పిల్లలకు మంచి అవకాశాలను కల్పించింది. విద్యతోపాటు క్రీడారంగంలోనూ ఈ సేవలు కొనసాగాలి’’ అని ఆకాంక్షించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని