Sanju Samson: సంజూ శాంసన్‌ ‘గిఫ్టెడ్‌’ ప్లేయరే.. కానీ: భారత మాజీ సెలెక్టర్

పేరుకు సీనియర్‌ అయినా.. అవకాశాలు మాత్రం చాలా తక్కువగా దక్కించుకున్న క్రికెటర్ సంజూ శాంసన్‌ (Sanju Samson). కొన్నిసార్లు వేగంగా ఆడే క్రమంలో త్వరగా పెవిలియన్‌కు చేరి నిరాశపరిచినా.. దూకుడైన ఆటతీరుతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన సందర్భాలూ ఉన్నాయి.

Updated : 04 Aug 2023 13:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత క్రికెటర్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson) వెస్టిండీస్‌తో మూడో వన్డేలో (WI vs IND) హాఫ్‌ సెంచరీ సాధించాడు. తొలి టీ20 మ్యాచ్‌లో 12 పరుగులు చేసి కుదురుకున్నట్లు కనిపించినా రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భారత మిడిలార్డర్‌కు కీలకంగా మారతాడని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో సంజూ శాంసన్‌ బ్యాటింగ్‌ తీరుపై మాజీ సెలెక్టర్ సబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. భారత మాజీ ఆటగాడు వసీమ్‌ జాఫర్ కీలక సూచనలు చేశాడు. 

ఒకే ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు చేసినా.. ఇషాన్‌ రెండో ఆప్షనే

పర్‌ఫెక్ట్‌ ప్లేయర్‌.. 

‘‘సంజూ శాంసన్‌ ఆటతీరు నాకు అంతుచిక్కని విషయం. అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తాడు. అతడు గిఫ్టెడ్‌ ప్లేయర్. అతడి ఇన్నింగ్స్‌ ఎప్పుడూ తాజాగా ఉంటుంది. ఎప్పుడూ దూకుడుగా ఆడేందుకు చూస్తానని అతడే చెప్పాడు. ముఖ్యంగా లెగ్‌ స్పిన్నర్‌ను ఎదుర్కొనేటప్పుడు మరింత దూకుడు ప్రదర్శిస్తాడు. సంజూ శాంసన్‌ సత్తా ఏంటో విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో చూశాం. అతడు కచ్చితంగా జట్టు మనిషి. ఇలాంటి ప్లేయర్‌ను తుది జట్టులో ఉంచుకోవాలి. టీమ్‌కు అవసరమైన సమయంలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడగల సమర్థుడు. అయితే, రెగ్యులర్‌ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకునేటప్పుడు మాత్రమే అతడికి అవకాశం వస్తోంది. అతడిని మూడో స్థానంలో పంపిస్తే మరింత మెరుగ్గా ఆడతాడు. ఐపీఎల్‌లో ఎక్కువగా ఇదే స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. మిడిలార్డర్‌లోనూ జట్టుకు విలువైన పరుగులు అందించగలడు’’ అని సబా కరీం వ్యాఖ్యానించాడు. 

ఇంకాస్త నేర్చుకోవాలి: వసీమ్‌ జాఫర్

‘‘సంజూ శాంసన్‌ అద్భుతమైన ఆటగాడు అనడంలో అనుమానం లేదు. అయితే, అతడు ఎప్పుడూ ఎక్కువగా రిస్క్‌ ఉండే ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. ఒక్కసారి అతడు దాని నుంచి బయటకొస్తే సిక్స్‌ల వర్షం కురిపించగలడు. ఇలా ఆడేందుకు టీమ్‌ అనుమతి ఇస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే నిలకడ అనేది సమస్యగా మారే అవకాశం ఉంది. విధ్వంసం చేయాలని భావిస్తే ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఓ రెండు లేదా మూడు ఇన్నింగ్స్‌ల్లో భారీగా పరుగులు సాధించడం కష్టమవుతుంది. గత ఐపీఎల్‌లోనూ చూశాం. సంజూ కొన్ని ఇన్నింగ్స్‌ల్లో ధాటిగా ఆడగా.. మరికొన్నింట్లో తేలిపోయాడు. కాబట్టి, నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది’’ అని వసీమ్ జాఫర్ సూచించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని