Babar azam: మిడిలార్డర్‌లో ఎందుకు ఆడడో అర్థం కాదు.. బాబర్‌ వల్లే పాక్‌ నష్టపోతోంది: డానిష్‌ కనేరియా

బాబర్‌ కేవలం ఇన్నింగ్స్‌ ప్రారంభించడానికే ఆసక్తి చూపుతున్నాడని, మిడిల్‌ ఆర్డర్‌లో ఆడేందుకు ఇష్టపడటంలేదని పాక్‌ మాజీ కెప్టెన్‌ డానిష్‌ కనేరియా విమర్శలు గుప్పించాడు.

Updated : 17 Nov 2022 12:14 IST

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌ ఆరంభంలోనే రెండు ఓటములను నమోదు చేసిన పాకిస్థాన్‌ అనూహ్యంగా ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసినప్పటికీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.  అయితే, జట్టు కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ ఈ టోర్నమెంట్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. న్యూజిలాండ్‌పై 53 పరుగులు మినహా మిగిలిన మ్యాచుల్లో సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే ఈ ఆటగాడు పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ కెప్టెన్‌ డానిష్‌ కనేరియా స్పందిస్తూ బాబర్‌పై విమర్శలు గుప్పించాడు. కేవలం ఇన్నింగ్స్‌ ప్రారంభించడానికే ఆసక్తి చూపుతున్నాడని, ఆర్డర్‌లోకి దిగడం లేదంటూ మండిపడ్డాడు. అతడి వల్ల పాక్‌ జట్టు నష్టపోవాల్సి వచ్చిందన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడూతూ.. విరాట్‌ కోహ్లీలాంటి నిస్వార్థమైన ఆటగాడిని ఇంత వరకు చూడలేదంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. 

‘‘బాబర్‌ అజామ్‌ ఓ మొండిఘటం. కరాచి జట్టుకు ఆడినప్పుడు కూడా ఇదే జరిగింది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయలేకపోవడంతో ఓపెనర్‌గా ఆడేందుకే మొండి పట్టుదలతో వ్యవహరించాడు. మిడిలార్డర్‌లో అతడెందుకు ఆడడో అర్థం కాదు. ఇలాంటి వైఖరి వల్ల జట్టు తీవ్రంగా నష్టపోతోంది. ఒకవేళ రిజ్వాన్‌ రాణిస్తే బాబర్‌ కూడా బాగా బ్యాటింగ్‌ చేస్తాడు. తన ఇన్నింగ్స్‌ను సైతం చాలా నెమ్మదిగా ప్రారంభిస్తాడు. నిస్వార్థంగా ఆడే ఆటగాళ్లలో టీమ్‌ఇండియా బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీని మించినవారు లేరు. అతడి కెప్టెన్సీలో టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ను కోల్పోయింది. ఆ విషయంలో ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. జట్టులో అతడి స్థానంపై చాలామంది ప్రశ్నలు లేవనెత్తారు. కానీ, వెనకడుగు వేయలేదు. కొత్త సారథికి పూర్తి సహకారం అందించాడు. ఏ నంబర్‌లో అయినా ఆడేందుకు సిద్ధంగా ఉంటాడు. ఆసియా కప్‌తో సరికొత్తగా ఉద్భవించాడు’’ అంటూ కనేరియా పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని