Gambhir: కోహ్లీతో గొడవ.. ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం: గౌతమ్‌ గంభీర్

సూటిగా మాట్లాడే గౌతమ్‌ గంభీర్‌.. విరాట్‌తో జరిగిన వాగ్వాదంపై మరోసారి స్పందించాడు. దీని గురించి ఎన్నిసార్లు అడిగినా తన సమాధానంలో మార్పు ఉండదని చెప్పాడు.

Published : 23 Dec 2023 14:36 IST

ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ - గౌతమ్‌ గంభీర్‌ (Virat Kohli) మధ్య ఐపీఎల్ సందర్భంగా తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం ఇప్పటికీ అభిమానుల మదిలో అలానే ఉండిపోయింది. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించిన గంభీర్‌ (Gautham Gambhir) తమ జట్టు ఆటగాడు నవీనుల్‌ హక్‌కు మద్దతుగా విరాట్‌తో వాగ్వాదం చేశాడు. ఈ విషయంపై ఇప్పటికే అతడు చాలాసార్లు స్పందించాడు. తాజాగా దక్షిణాఫ్రికా-భారత్‌ (SA vs IND) వన్డే సిరీస్‌ అనంతరం జరిగిన ఓ కార్యక్రమంలో గంభీర్‌ ముందు ఇదే ప్రశ్న పునరావృతమైంది. దీనికి అతడు కాస్త అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. 

ఇటీవల విరాట్ కోహ్లీ వన్డేల్లో 50వ శతకం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎవరి బౌలింగ్‌లో ఈ మార్క్‌ను అందుకున్నాడని క్రీడా కార్యక్రమంలో గంభీర్‌ను వ్యాఖ్యాత అడిగాడు. ‘‘లాకీ ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో కోహ్లీ సెంచరీ మార్క్‌ను తాకాడు. వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై’’ అని గంభీర్ సమాధానం ఇచ్చాడు. వెంటనే సదరు వ్యాఖ్యాత మరోసారి ఐపీఎల్‌ నాటి సంఘటనను ప్రస్తావించాడు. దీంతో గంభీర్‌ స్పందిస్తూ.. ‘‘మీరు పదే పదే ఆ క్లిప్పింగ్‌లను చూపించినా.. నా సమాధానం ఒక్కటే. కోహ్లీ అయినా.. వేరేవారైనా వాగ్వాదం అనేది కేవలం మైదానంలోనే’’ అని స్పష్టం చేశాడు. ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సంజూలో పట్టుదల కనిపించింది..

దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో సంజూ శాంసన్‌ సెంచరీ సాధించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీనిపై గంభీర్‌ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘సంజూ శాంసన్‌ అద్భుతమైన టాలెంట్‌ కలిగిన ఆటగాడు. ఐపీఎల్‌లో అతడి ఆటతీరు గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. ఇప్పుడు ఈ ఇన్నింగ్స్‌తో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు పునరుజ్జీవం వచ్చినట్లు అయింది. దీనికి ముందు చాలా అవకాశాలు వచ్చినా ఒడిసిపట్టుకోలేకపోయాడు. కానీ, ఇప్పుడు ఈ శతకంతో సెలక్టర్లను ఆకట్టుకోవడమే కాకుండా.. వారిపై ఒత్తిడి కూడా తెచ్చినట్లే. అయితే, ఇలాంటి నిలకడను మున్ముందు కొనసాగించాల్సిన అవసరం ఉంది. అలాగే సంజూకు వన్డే ఫార్మాట్‌లో అవకాశాలు ఇవ్వాలి’’ అని గంభీర్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని