మా గ్రౌండ్‌లో చొక్కా విప్పేస్తే ఊరుకుంటానా: దాదా

క్రికెట్‌ మక్కా లార్డ్స్‌ మైదానం. ఆతిథ్య ఇంగ్లాండ్‌ 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. భీకర పేసర్లు, వైవిధ్యమైన వాతావరణంలో లక్ష్యఛేదన అంత సులభమేమీ కాదు. అప్పటికే వరుసగా తొమ్మిది ఫైనళ్లలో ఓడిన జట్టుకైతే మరీ కష్టం.....

Published : 14 Jul 2020 01:48 IST

నాట్‌వెస్ట్‌ సిరీస్‌ గెలిచి నేటికి 18 ఏళ్లు

చిరస్మరణీయంగా యువీ, కైఫ్ ఇన్నింగ్స్‌

చొక్కా విప్పి బదులు తీర్చుకున్న దాదా‌

క్రికెట్‌ మక్కా లార్డ్స్‌ మైదానం. ఆతిథ్య ఇంగ్లాండ్‌ 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. భీకర పేసర్లు, వైవిధ్యమైన వాతావరణంలో లక్ష్యఛేదన అంత సులభమేమీ కాదు. అప్పటికే వరుసగా తొమ్మిది ఫైనళ్లలో ఓడిన జట్టుకైతే మరీ కష్టం.

ఛేదనలో 24 ఓవర్లకే 146/5 కష్టాల్లో పడింది ప్రత్యర్థి జట్టు. సీనియర్లు లేరు. జూనియర్లకు ఇంగ్లిష్‌ వాతావరణం కొత్త. గెలిచే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారా ఇద్దరు యువకులు. 18 ఓవర్లకు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మరో మూడు బంతులు మిగిలుండగానే విజయం అందించారు. పట్టరాని ఉద్వేగంతో అప్పుడా జట్టు సారథి చొక్కా విప్పి పగ తీర్చుకున్నాడు. వాళ్లెవరో.. ఆ మ్యాచేంటో గుర్తొచ్చిందా! ఆ.. అదే..! నాట్‌వెస్ట్‌ ట్రోఫీ గెలిచి నేటికి (జులై 13) సరిగ్గా 18 ఏళ్లు.


ఎప్పటికీ ప్రత్యేకం

నాట్‌వెస్ట్‌ ముక్కోణపు సిరీస్‌ ఫైనలే ఓ ప్రత్యేకం. అంతకు ముందే ఇంగ్లాండ్‌ ఉపఖండానికి వచ్చి సిరీస్‌ గెలిచింది. ఆ జట్టు ఆటగాడు ఫ్లింటాఫ్‌ చొక్కా విప్పి వాంఖడే మొత్తం పరుగులు పెట్టాడు. దాదాకూ అతడికీ నడుమ కనిపించని ఆత్మగౌరవ పోరాటం కొనసాగుతోంది. అందుకే 326 పరుగుల లక్ష్యాన్ని కసిగా ఛేదించేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఓపెనర్లు గంగూలీ (60; 43 బంతుల్లో 10×4, 1×6), వీరేంద్ర సెహ్వాగ్‌ (45; 48 బంతుల్లో 7×4) చెలరేగి ఆడారు. దాదా 35 బంతుల్లో అర్ధశతకం బాదేశాడు. దాంతో 15 ఓవర్లలోపే భారత్‌ 106 పరుగులు చేసింది. కానీ ఇంగ్లాండ్‌ బౌలర్లు పుంజుకొని 24 ఓవర్లకే 146కు 5 వికెట్లు పడగొట్టారు. ద్రవిడ్‌, సచిన్‌, మోంగియా విఫలమయ్యారు.


అనుమానాలు పటాపంచలు!

ఇక.. అయిపోయిందీ అనుకున్న తరుణంలో యువీ (69; 63 బంతుల్లో 9×4, 1×6), మహ్మద్‌ కైఫ్‌ (87*; 75 బంతుల్లో 6×4, 2×6) ఆరో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. ఇందుకు 18 ఓవర్లే తీసుకున్నారు. నిజానికి.. కైఫ్‌ మీద ఎవరికీ అంతగా విశ్వాసం లేదు. అతడు యువీకి సింగిల్స్‌ తీసిస్తే చాలు! అనుకున్నారు. గంగూలీ సైతం ఇదే అనుకొన్నాడు. కానీ ప్రత్యర్థి బౌలర్‌ విసిరిన బౌన్సర్‌ను అప్పర్‌కట్‌తో సిక్సర్‌గా మలిచి అనుమానాలను కైఫ్‌ పటాపంచలు చేశాడు. ఆ తర్వాత ఈ యువజోడీ ఆకాశమే హద్దుగా అంతులేని ఆత్మవిశ్వాసంతో పరుగుల వరద పారించింది. యువీ బ్యాక్‌ఫుట్‌, కైఫ్‌ రిస్ట్‌వర్క్‌తో ఆకట్టుకున్నారు. అయితే 41.4వ బంతికి యువీని.. కాలింగ్‌వుడ్‌ ఔట్‌ చేశాడు. అప్పుడు స్కోరు 267. మైదానంలో ఒత్తిడి పెరిగిపోయింది. భారత అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. కైఫ్‌.. సాధించగలడా? విజయం అందించగలడా అనుకుంటుండగా భజ్జీ (15; 13 బంతుల్లో)తో కలిసి 47 పరుగులు విలువైన పరుగుల భాగస్వామ్యం అందించాడు. చివర్లో ఫ్లింటాఫ్‌.. భజ్జీ, కుంబ్లేను పెవిలియన్‌ పంపినా మరో 3 బంతులు మిగిలుండగానే కైఫ్‌ పని పూర్తి చేసేశాడు.


బదులిచ్చిన దాదా

ఈ విజయం అందరికీ గొప్ప కిక్కిచ్చింది. ముంబయిలో ఫ్లింటాఫ్‌ చేసినదానికి దాదా కసిదీరా బదులిచ్చాడు. లార్డ్స్‌ బాల్కనీలో చొక్కా విప్పేసి గిరగిరా తిప్పుతూ సింహనాదాలు చేశాడు. ఇప్పటికీ ఆ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది. గంగూలీ ఆఫ్‌సైడ్‌ కొట్టే కవర్‌డ్రైవ్‌లు అంటే జెఫ్రీ బాయ్‌కాట్‌కు బాగా ఇష్టం. అతడిని ప్రత్యేకంగా అభిమానిస్తాడు. ఒకానొక సందర్భంలో ‘బాయ్‌.. లార్డ్స్‌ అంటే అంతర్జాతీయ క్రికెట్‌కు మక్కాలాంటిది కదా! చొక్కా విప్పొచ్చా?’ అని బాయ్‌కాట్‌ అడగ్గా ‘మరి.. వాంఖడే మాకూ లార్డ్స్‌లాంటిదే. ఫ్లింటాఫ్‌ అలా చేయొచ్చా’ అని దాదా బదులిచ్చాడట! ప్రస్తుతం నాట్‌వెస్ట్‌ ఫైనల్‌ మధురస్మృతులను అభిమానులు సోషల్‌ మీడియాలో గుర్తుచేసుకుంటున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని