Abhimanyu Easwaran: అభిమన్యు స్టేడియంలో అభిమన్యు ఆట

వివ్‌ రిచర్డ్స్‌, లారా, అలెన్‌ బోర్డర్‌.. ఇలా క్రికెట్‌లో దిగ్గజాలుగా ఎదిగిన వాళ్ల పేర్లతో స్టేడియాలు ఉన్నాయి. కానీ ఇంకా దేశం తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయని ఆటగాడి పేరుతో స్టేడియం ఉంటుందని..

Updated : 03 Jan 2023 08:07 IST

దిల్లీ: వివ్‌ రిచర్డ్స్‌, లారా, అలెన్‌ బోర్డర్‌.. ఇలా క్రికెట్‌లో దిగ్గజాలుగా ఎదిగిన వాళ్ల పేర్లతో స్టేడియాలు ఉన్నాయి. కానీ ఇంకా దేశం తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయని ఆటగాడి పేరుతో స్టేడియం ఉంటుందని.. అందులో ఇప్పుడా క్రికెటర్‌ ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడబోతున్నాడని ఎవరైనా అనుకుంటారా? ఆ అరుదైన ప్రత్యేకతనే అందుకోబోతున్నాడు బెంగాల్‌ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్‌. మంగళవారం దేహ్రాదూన్‌లోని ‘అభిమన్యు క్రికెట్‌ అకాడమీ స్టేడియం’లో ఆరంభమయ్యే రంజీ మ్యాచ్‌లో ఉత్తరాఖండ్‌తో అతని జట్టు తలపడుతుంది. అభిమన్యు పేరు మీద ఈ స్టేడియాన్ని తండ్రి రంగనాథన్‌ పరమేశ్వరన్‌ నిర్మించాడు.

వృత్తిరీత్యా ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ అయిన అతను.. అభిమన్యు (1995) పుట్టకముందే 1988లో ‘అభిమన్యు క్రికెట్‌ అకాడమీ’ ఏర్పాటు చేశాడు. 2005లో సొంతడబ్బుతో స్థలం కొని, ఆ తర్వాతి ఏడాది స్టేడియం నిర్మాణం మొదలెట్టాడు. అత్యాధునిక వసతులతో ఉన్న ఈ స్టేడియంలో టీమ్‌ఇండియా క్రికెటర్లు షమి, శ్రేయస్‌, దినేశ్‌ కార్తీక్‌ కూడా ప్రాక్టీస్‌ చేశారు. అభిమన్యు కూడా ఇక్కడే శిక్షణ పొంది ఆటలో రాటుదేలాడు. ఫ్లడ్‌లైట్లు కూడా ఉన్న ఈ స్టేడియాన్ని దేశవాళీ మ్యాచ్‌ల కోసం బీసీసీఐ తీసుకుంది. ‘‘క్రికెట్‌ నేర్చుకున్న చోటే రంజీ మ్యాచ్‌ ఆడబోతుండడం గర్వంగా ఉంది. ఆటపై నా తండ్రికి ఉన్న ప్రేమకు, ఆయన కృషికి ఇది నిదర్శనం. స్వస్థలానికి రావడం ఎప్పుడూ గొప్పగా ఉంటుంది. కానీ ఒక్కసారి మైదానంలో అడుగుపెడితే బెంగాల్‌ విజయంపైనే దృష్టి పెడతా’’ అని అభిమన్యు చెప్పాడు. ‘‘స్టేడియం యజమానే అందులో ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడిన సందర్భాలు లేవనే చెప్పాలి. కానీ ఇది నాకు ఘనతేమీ కాదు. నా తనయుడు దేశానికి వంద టెస్టులు ఆడితేనే గొప్పగా ఉంటుంది’’ అని రంగనాథన్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని