IND vs AUS: అహ్మదాబాద్‌లో స్పిన్నెంత?

నాలుగో టెస్టుకు ఎలాంటి పిచ్‌ను సిద్ధం చేస్తున్నారు? తొలి మూడు టెస్టుల్లో లాగే బంతి విపరీతంగా తిరగబోతుందా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం.

Updated : 08 Mar 2023 07:47 IST

నాలుగో టెస్టుకు ఎలాంటి పిచ్‌ను సిద్ధం చేస్తున్నారు? తొలి మూడు టెస్టుల్లో లాగే బంతి విపరీతంగా తిరగబోతుందా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. అందరి దృష్టీ అహ్మదాబాద్‌పైనే. పిచ్‌కు సంబంధించి బయటికొచ్చిన చిత్రాలు దాని స్వభావంపై అస్పష్టతను మరింత పెంచేలా ఉన్నాయి.

అహ్మదాబాద్‌

సొంతగడ్డపై ఆడుతుందంటే స్పిన్నే టీమ్‌ఇండియా ఆయుధం. ఇప్పుడు బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లోనూ అదే అస్త్రాన్ని సంధించింది. గిరా గిరా తిరిగే పిచ్‌లతో తొలి రెండు టెస్టులను ఖాతాలో వేసుకుంది. కానీ తర్వాతే వ్యూహం బెడిసి కొట్టింది. మరింత విపరీతంగా సహకరించిన ఇందౌర్‌ పిచ్‌పై బోల్తా కొట్టడం రోహిత్‌సేన వంతయింది. నాణ్యత విషయంలో తొలి రెండు టెస్టుల పిచ్‌లకు పాసు మార్కులతో సరిపెట్టిన ఐసీసీ.. మూడో టెస్టు పిచ్‌పై పెదవి విరిచింది. పేలవ రేటింగ్‌ ఇచ్చింది. ‘‘పిచ్‌ మరీ పొడిగా ఉంది. బ్యాట్‌కు, బంతికి సమతూకం లేదు. పిచ్‌ ఆరంభం నుంచే స్పిన్నర్లకు సహకరించింది. మ్యాచ్‌ ఆసాంతం బౌన్స్‌ అతిగా, అస్థిరంగా ఉంది’’ అని రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ తన నివేదికలో పేర్కొన్నాడు. తొలి రోజు నుంచే స్పిన్‌కు విపరీతంగా సహరించడమేంటని మాజీ ఆటగాళ్లూ విమర్శించారు. శ్రీకాంతైతే ఆ పిచ్‌పై తానూ వికెట్లు తీసే వాడినని అన్నాడు. ఈ నేపథ్యంలో నిర్ణయాత్మక నాలుగో టెస్టుకు ఎలాంటి పిచ్‌ ఉండబోతుందన్న ఆసక్తి పెరిగింది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే టీమ్‌ ఇండియాకు విజయం తప్పనిసరి కావడంతో ఈ మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా.. సిరీస్‌లో భారత్‌ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించిన సంగతి తెలిసిందే.

పిచ్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదా?: నరేంద్ర మోదీ స్టేడియంలో పిచ్‌ ఎలాంటి ఉండాలన్న దానిపై బీసీసీఐ ఇంకా ఒక నిర్ణయం తీసుకోనట్లే కనిపిస్తోంది. పిచ్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలు బయటికొచ్చాయి. కానీ ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై ఆస్ట్రేలియా బృందం ఒక నిర్ణయం తీసుకోలేకపోతోంది. మ్యాచ్‌ ఆరంభమయ్యేది గురువారమే. ఎంతో సమయం లేదు. అయినా పిచ్‌ తయారీకి సంబంధించి బీసీసీఐ నుంచి గానీ, భారత జట్టు మేనేజ్‌మెంట్‌ నుంచి తమకు ఎలాంటి సూచనలు అందలేదని క్యురేటర్లు చెప్పారు. దీన్ని బట్టి ఎలాంటి పిచ్‌ కావాలన్న విషయంలో భారత శిబిరం కూడా సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం వరకు నాలుగో టెస్టు వేదికలో రెండు పిచ్‌లను కప్పి ఉంచారు. మ్యాచ్‌కు దేన్ని ఉపయోగిస్తారో తెలియదు. దీంతో పిచ్‌ స్వభావంపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ‘‘భారత జట్టు మేనేజ్‌మెంట్‌ నుంచి మాకు ఏ సూచనలూ అందలేదు. స్థానిక క్యురేటర్లు మామూలు పిచ్‌ను సిద్ధం చేస్తున్నారు. సీజన్‌ ఆసాంతం ఉన్నట్లే పిచ్‌ ఇప్పుడూ ఉంటుంది’’ అని గుజరాత్‌ క్రికెట్‌ సంఘానికి చెందిన ఓ అధికారి ఇంతకుముందు చెప్పాడు. మంచి టెస్టు మ్యాచ్‌ పిచ్‌ను సిద్ధం చేయాలన్నదే తమ లక్ష్యమన్నాడు. ఏదేమైనా మ్యాచ్‌ ఫలితంలో పిచ్‌ మరోసారి కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. రెగ్యులర్‌ కెప్టెన్‌ కమిన్స్‌ సిడ్నీలోనే ఉన్న నేపథ్యంలో.. ఆఖరి టెస్టులోనూ ఆస్ట్రేలియాకు స్మిత్‌ నాయకత్వం వహించనున్నాడు. గత టెస్టులో గెలిచిన జట్టులో ఆసీస్‌ మార్పులు చేసే అవకాశం లేదు. మరోవైపు భారత జట్టులోకి మహ్మద్‌ షమి రావడం ఖాయం. గత మ్యాచ్‌కు అతడికి విశ్రాంతినిచ్చిన జట్టు.. ఉమేశ్‌ యాదవ్‌ను ఆడించింది. ఈసారి సిరాజ్‌కు    విశ్రాంతినిచ్చి షమికి జోడీగా ఉమేశ్‌ను కొనసాగించవచ్చు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని