Suryakumar Yadav: హ్యాట్రిక్‌ డక్‌.. తొలి బంతికే.. వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్‌

ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు.. అతను క్రీజులో అడుగుపెడితే మెరుపులే. సిక్సర్ల సునామీ.. బౌండరీల తుపాను ప్రత్యర్థిని ముంచెత్తాల్సిందే.

Updated : 23 Mar 2023 08:33 IST

ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు.. అతను క్రీజులో అడుగుపెడితే మెరుపులే. సిక్సర్ల సునామీ.. బౌండరీల తుపాను ప్రత్యర్థిని ముంచెత్తాల్సిందే. మైదానంలో అన్ని దిక్కులా.. క్రీజులో నృత్యం చేస్తూ అతనాడే షాట్లు అద్భుతం.. ఇదీ టీ20ల్లో సూర్యకుమార్‌ స్థాయి. పొట్టి ఫార్మాట్లో ప్రపంచం మెచ్చిన ఆటగాడతను. కానీ వన్డేలకు వచ్చేసరికి అతని ఆటతీరు, ప్రదర్శన పూర్తి విరుద్ధం. ఇప్పటివరకూ 21 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 24.05 సగటుతో 433 పరుగులే చేశాడు. 2021 జులైలో శ్రీలంకతో సిరీస్‌లో వన్డేల్లో అడుగుపెట్టిన సూర్య.. ఆరంభంలో మెరుగ్గానే రాణించాడు. తొలి ఆరు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 31 నాటౌట్‌, 53, 40, 39, 34 నాటౌట్‌, 64 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాతే అతని ఆట గాడితప్పింది.

టీ20ల్లో విధ్వంసం సృష్టిస్తున్న అతను.. వన్డేల్లో కనీసం క్రీజులో నిలబడలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అయితే మరీ దారుణం. మూడు మ్యాచ్‌ల్లోనూ ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. తొలి రెండు వన్డేల్లో స్టార్క్‌ బౌలింగ్‌లో ఒకే విధంగా వికెట్ల ముందు దొరికిపోయిన అతను.. మూడో మ్యాచ్‌లో అగర్‌ బంతిని అర్థం చేసుకోలేక బౌల్డయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతణ్ని ఏడో స్థానంలో ఆడించినా ఫలితం లేకపోయింది. ఛేదన కష్టంగా మారి.. టీ20 తరహా పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ సూర్య ఆడలేకపోయాడు. ప్రస్తుతం శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా సూర్యకు జట్టులో చోటు దక్కుతోంది. అతణ్ని ప్రోత్సహిస్తామని కెప్టెన్‌ చెబుతున్నప్పటికీ శ్రేయస్‌ తిరిగి కోలుకుని వస్తే సూర్య తుది జట్టుకు దూరం కావడం ఖాయం. పరిస్థితి చూస్తుంటే అతను వన్డే ప్రపంచకప్‌లోనూ ఆడడం అనుమానంగానే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని