LSG vs PBKS: రజా మెరుపులతో.. పంజాబ్‌ గెలుపు బాట

కెప్టెన్‌ ధావన్‌ అందుబాటులో లేడు. బ్యాటింగ్‌లో ఎక్కువగా కొత్త ముఖాలే. లక్ష్యం 160 పరుగులే అయినా.. 11 ఓవర్లకు 75/4తో నిలిచింది పంజాబ్‌.

Updated : 16 Apr 2023 08:12 IST

లఖ్‌నవూకు రెండో ఓటమి
రాహుల్‌ పోరాటం వృథా
లఖ్‌నవూ

కెప్టెన్‌ ధావన్‌ అందుబాటులో లేడు. బ్యాటింగ్‌లో ఎక్కువగా కొత్త ముఖాలే. లక్ష్యం 160 పరుగులే అయినా.. 11 ఓవర్లకు 75/4తో నిలిచింది పంజాబ్‌. ఆ జట్టుకు హ్యాట్రిక్‌ ఓటమి, లఖ్‌నవూకు హ్యాట్రిక్‌ విజయం లాంఛనమే అనుకున్నారంతా. కానీ జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సికందర్‌ రజా  (57; 41 బంతుల్లో 4×4, 3×6) అనూహ్యంగా చెలరేగిపోయాడు. భారీ షాట్లతో లఖ్‌నవూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో మ్యాచ్‌ పంజాబ్‌ సొంతమైంది. లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (74; 56 బంతుల్లో 8×4, 1×6) పోరాటం వృథా అయింది.

పీఎల్‌-16లో శనివారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 2 వికెట్ల తేడాతో లఖ్‌నవూను ఓడించింది. సికందర్‌ రజాకు తోడు మాథ్యూ షార్ట్‌ (34; 22 బంతుల్లో 5×4, 1×6), షారుక్‌ ఖాన్‌ (23 నాటౌట్‌; 10 బంతుల్లో 1×4, 2×6) రాణించడంతో 160 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ (2/18), యుధ్‌వీర్‌ (2/19), మార్క్‌ వుడ్‌ (2/35) రాణించారు. మొదట లఖ్‌నవూ 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. సామ్‌ కరన్‌ (3/31), రబాడ (2/34) ఆ జట్టుకు కళ్లెం వేశారు.

అతనొచ్చాకే..: ఛేదనలో సికందర్‌ రజా మెరుపులు మొదలయ్యే వరకు పంజాబ్‌ పోటీలోనే లేదు. ధావన్‌ లేని ఆ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ చాలా బలహీనంగా కనిపించింది. కొత్త ఓపెనర్‌ అథర్వ (0)తో పాటు రాహుల్‌ చాహర్‌ స్థానంలో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా వచ్చిన ప్రభ్‌సిమ్రన్‌ (4)లను ఒకే ఓవర్లో ఔట్‌ చేసిన యువ బౌలర్‌ యుధ్‌వీర్‌.. కింగ్స్‌ను గట్టి దెబ్బ తీశాడు. ఈ దశలో షార్ట్‌ ధాటిగా ఆడి స్కోరు బోర్డును కదిలించినా.. ప్రమాదకరంగా మారుతున్న అతణ్ని గౌతమ్‌ ఔట్‌ చేశాడు. హర్‌ప్రీత్‌ సింగ్‌ (22) కూడా వెనుదిరగడంతో పంజాబ్‌కు మరింత కష్టాల్లో పడింది. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై 11 ఓవర్లలో 85 పరుగులు చేయడం చాలా కష్టంగానే కనిపించింది. కానీ రజా.. లఖ్‌నవూ బౌలర్లపై ఎదురుదాడి చేయడంతో పరిస్థితి మారిపోయింది. కృనాల్‌ వేసిన 13వ ఓవర్లో అతను వరుసగా 6, 6, 4 బాదడంతో రన్‌రేట్‌ అదుపులోకి వచ్చింది. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా రజా మాత్రం దూకుడు కొనసాగించాడు. 14 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన స్థితిలో రజా ఔటైనా.. షారుక్‌ పోరాడి పంజాబ్‌ను గెలిపించాడు.

నిలిచిన రాహుల్‌: మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ ఇన్నింగ్స్‌ను మెరుగ్గానే ఆరంభించినా.. ఆ తర్వాత తడబడి ఓ మోస్తరు స్కోరుకు పరిమితమైంది. పంజాబ్‌ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి లఖ్‌నవూకు కళ్లెం వేశారు. రాహుల్‌ ఎప్పట్లాగే నెమ్మదిగా ఆడినప్పటికీ.. మేయర్స్‌ (29; 23 బంతుల్లో 1×4, 3×6) ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో పవర్‌ ప్లేలో 49/0తో నిలిచింది. మేయర్స్‌ ఉన్నంతసేపు మెరుపు షాట్లతో అలరించాడు. సామ్‌ కరన్‌ బౌలింగ్‌లో స్క్వేర్‌ కట్‌తో పాయింట్‌లో అతను సిక్సర్‌ కొట్టిన తీరు మ్యాచ్‌కే హైలైట్‌. అయితే హర్‌ప్రీత్‌ బ్రార్‌ బౌలింగ్‌లో మేయర్స్‌ వెనుదిరిగాక లఖ్‌నవూ ఇన్నింగ్స్‌ గాడి తప్పింది. దీపక్‌ హుడా (2) వైఫల్యాన్ని కొనసాగించగా.. కృనాల్‌ (18)తో కలిసి రాహుల్‌ మళ్లీ ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టే ప్రయత్నం చేశాడు. అతను 38 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా.. 14 ఓవర్లకు లఖ్‌నవూ 108/2తో నిలిచింది. ఇక స్కోరు వేగం పెరుగుతుందనుకుంటే.. రబాడ వరుస బంతుల్లో కృనాల్‌, ప్రమాదకర పూరన్‌ (0)లను ఔట్‌ చేసి సూపర్‌జెయింట్స్‌ను గట్టి దెబ్బ తీశాడు. రెండు సిక్సర్లు బాది ఊపు మీద కనిపించిన స్టాయినిస్‌ (15)ను కరన్‌ ఔట్‌ చేయగా.. రాహుల్‌ కొన్ని షాట్లు ఆడి స్కోరును 150 దాటించాడు. అతను 19వ ఓవర్లో వెనుదిరిగాడు. చివరి ఓవర్లో కరన్‌   7 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.


లఖ్‌నవూ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) ఎలిస్‌ (బి) అర్ష్‌దీప్‌ 74; మేయర్స్‌ (సి) హర్‌ప్రీత్‌ సింగ్‌ (బి) బ్రార్‌ 29; దీపక్‌ హుడా ఎల్బీ (బి) రజా 2; కృనాల్‌ (సి) షారుఖ్‌ (బి) రబాడ 18; పూరన్‌ (సి) షారుఖ్‌ (బి) రబాడ 0; స్టాయినిస్‌ (సి) జితేశ్‌ (బి) కరన్‌ 15; బదోని నాటౌట్‌ 5; గౌతమ్‌ (సి) రజా (బి) కరన్‌ 1; యుధ్‌వీర్‌ (సి) షారుఖ్‌ (బి) కరన్‌ 0; బిష్ణోయ్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 159; వికెట్ల పతనం: 1-53, 2-62, 3-110, 4-111, 5-142, 6-150, 7-154, 8-154; బౌలింగ్‌: షార్ట్‌ 2-0-10-0; అర్ష్‌దీప్‌ 3-0-22-1; రబాడ 4-0-34-2; సామ్‌ కరన్‌ 4-0-31-3; హర్‌ప్రీత్‌ బ్రార్‌ 2-0-10-1; సికందర్‌ రజా 2-0-19-1; రాహుల్‌ చాహర్‌ 3-0-28-0

పంజాబ్‌ కింగ్స్‌: అథర్వ (సి) అవేష్‌ (బి) యుధ్‌వీర్‌ 0; ప్రభ్‌సిమ్రన్‌ (బి) యుధ్‌వీర్‌ 4; షార్ట్‌ (సి) స్టాయినిస్‌ (బి) గౌతమ్‌ 34; హర్‌ప్రీత్‌ సింగ్‌ (సి) ప్రేరక్‌ (బి) కృనాల్‌ 22; సికందర్‌ రజా (సి) స్టాయినిస్‌ (బి) రవి బిష్ణోయ్‌ 57; సామ్‌ కరన్‌ (సి) కృనాల్‌ (బి) రవి బిష్ణోయ్‌ 6; జితేశ్‌ (సి) రాహుల్‌ (బి) వుడ్‌ 2; షారుక్‌ ఖాన్‌ నాటౌట్‌ 23; హర్‌ప్రీత్‌ బ్రార్‌ (సి) పూరన్‌ (బి) వుడ్‌ 6; రబాడ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (19.3 ఓవర్లలో 8 వికెట్లకు) 161; వికెట్ల పతనం:1-0, 2-17, 3-45, 4-75, 5-112, 6-122, 7-139, 8-153; బౌలింగ్‌: యుధ్‌వీర్‌ సింగ్‌ 3-0-19-2; అవేష్‌ఖాన్‌ 3-0-24-0; వుడ్‌ 4-0-35-2; గౌతమ్‌ 4-0-31-1; కృనాల్‌ 3-0-32-1; రవి బిష్ణోయ్‌ 2.3-0-18-2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని