RR vs GT: ఛాంపియన్‌ ఆట

5 ఓవర్లకు 47/1.. అనంతరం 71 పరుగుల వ్యవధిలో 9 వికెట్లు.. ఇన్నింగ్స్‌లో రెండంకెల స్కోరు చేసింది నలుగురే.. అందులో 15 కంటే ఎక్కువ పరుగులు చేసింది ఒక్కరే

Updated : 06 May 2023 07:21 IST

రాజస్థాన్‌పై గుజరాత్‌ ఘన విజయం

తిప్పేసిన రషీద్‌, అహ్మద్‌

సత్తాచాటిన సాహా, గిల్‌, హార్దిక్‌

జైపుర్‌

5 ఓవర్లకు 47/1.. అనంతరం 71 పరుగుల వ్యవధిలో 9 వికెట్లు.. ఇన్నింగ్స్‌లో రెండంకెల స్కోరు చేసింది నలుగురే.. అందులో 15 కంటే ఎక్కువ పరుగులు చేసింది ఒక్కరే.. గుజరాత్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌లో రాజస్థాన్‌ వైఫల్యానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఓ వైపు నుంచి పేస్‌.. మరోవైపు నుంచి స్పిన్‌తో ఉక్కిరిబిక్కిరి చేయడంతో పాటు ఫీల్డింగ్‌లోనూ టైటాన్స్‌ అదరగొట్టడంతో రాయల్స్‌ నిలవలేకపోయింది. ఆడుతూ పాడుతూ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్‌.. ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది.

ఐపీఎల్‌- 16లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. దిల్లీతో గత మ్యాచ్‌లో 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన ఆ జట్టు.. శుక్రవారం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తుచేసింది. ఏకపక్షంగా సాగిన పోరులో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రషీద్‌ ఖాన్‌ (3/14), నూర్‌ అహ్మద్‌ (2/25) ధాటికి మొదట రాజస్థాన్‌ 17.5 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. 30 పరుగులు చేసిన శాంసనే టాప్‌స్కోరర్‌ అంటే ఆ జట్టు బ్యాటింగ్‌ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అనంతరం ఛేదనలో ఓ వికెట్‌ కోల్పోయిన టైటాన్స్‌ 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. సాహా (41 నాటౌట్‌; 34 బంతుల్లో 5×4), శుభ్‌మన్‌ గిల్‌ (36; 35 బంతుల్లో 6×4), హార్దిక్‌ పాండ్య (39 నాటౌట్‌; 15 బంతుల్లో 3×4, 3×6) సత్తాచాటారు. 10 మ్యాచ్‌ల్లో టైటాన్స్‌కిది ఏడో విజయం కాగా.. రాజస్థాన్‌కు అయిదో ఓటమి.

ధనాధన్‌..: అప్పటివరకూ రాజస్థాన్‌ బ్యాటర్లు తడబడ్డ పిచ్‌పై గుజరాత్‌ ఓపెనర్లు చెలరేగారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ శుభ్‌మన్‌ కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకోగా.. సాహా మాత్రం తొలి ఓవర్‌ నుంచే బౌండరీల వేటలో సాగాడు. నెమ్మదిగా శుభ్‌మన్‌ కూడా జోరందుకోవడంతో పవర్‌ప్లేలో 49/0తో నిలిచిన టైటాన్స్‌ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. స్పిన్నర్లు రంగంలోకి దిగినా శుభ్‌మన్‌, సాహా ఏ మాత్రం తగ్గలేదు. లక్ష్యం చిన్నదే కావడంతో ఎలాంటి తొందరపాటు, తడబాటు లేకుండా బ్యాటింగ్‌ కొనసాగించారు. సింగిల్స్‌తో స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ లక్ష్యాన్ని కరిగించారు. జంపా బౌలింగ్‌లో డ్రైవ్‌తో శుభ్‌మన్‌ కొట్టిన ఫోర్‌ ఆకట్టుకుంది. కానీ వెంటనే చాహల్‌ (1/22) లెగ్‌ కట్టర్‌ను అంచనా వేయలేక శుభ్‌మన్‌ స్టంపౌటయ్యాడు. దీంతో 71 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. కానీ ఆ ఆనందం రాజస్థాన్‌కు మిగిల్చకుండా హార్దిక్‌ వస్తూనే తుపానులా ముంచెత్తాడు. అప్పటివరకూ ఓ మోస్తారుగా సాగిన ఇన్నింగ్స్‌కు రాకెట్‌ వేగాన్ని అందించాడు. స్టేడియంలోని అభిమానులను ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఉర్రూతలూగించాడు. జంపా బౌలింగ్‌లో వరుసగా 6, 4, 6, 6 బాదాడు. మూడు సిక్సర్లనూ బౌలర్‌ తల మీదుగా బౌండరీ దాటించి ఛేదనను మరింత వేగవంతం చేశాడు. సాహా, హార్దిక్‌ కలిసి మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. ఈ జంట అబేధ్యమైన రెండో వికెట్‌కు 25 బంతుల్లోనే 48 పరుగులు జోడించింది.

టపటపా..: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ మెరుగైన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. పిచ్‌ పరిస్థితులను అర్థం చేసుకోలేక బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. స్పిన్‌కు దాసోహమన్నారు. బ్యాటింగ్‌లో నిలకడ లేమి కొనసాగిస్తున్న బట్లర్‌ (8)ను తన తొలి ఓవర్లో (ఇన్నింగ్స్‌ 2వ)నే హార్దిక్‌ (1/22) పెవిలియన్‌ చేర్చాడు. మరో ఓపెనర్‌ యశస్వి (14), కెప్టెన్‌ శాంసన్‌ నిలకడగా బౌండరీలు సాధించడంతో జట్టు 5 ఓవర్లకు 47/1తో మెరుగ్గానే నిలిచింది. కానీ ఆ తర్వాతే గుజరాత్‌ ఫీల్డింగ్‌, బౌలింగ్‌లో అదరగొట్టి కథను మలుపు తిప్పింది. వరుసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లు పడ్డాయి. మంచి ఫామ్‌లో ఉన్న యశస్వి.. అభినవ్‌, మోహిత్‌ అద్భుత ఫీల్డింగ్‌తో రనౌటయ్యాడు. బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ మీదుగా శాంసన్‌ బంతి ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ వలయం లోపల ఉన్న అభినవ్‌ డైవ్‌ చేసి.. తన పక్కన ఉన్న మోహిత్‌ వైపు బంతి వెళ్లేలా చేశాడు. అప్పటికే పరుగు కోసం శాంసన్‌ దగ్గర వరకూ వచ్చిన యశస్వి.. తిరిగి నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌ వైపు పరుగెత్తాడు. అతను క్రీజులోకి చేరుకునే లోపు మోహిత్‌ త్రోను అందుకున్న రషీద్‌ స్టంప్స్‌ ఎగరగొట్టాడు. అక్కడి నుంచి బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. శాంసన్‌ను లిటిల్‌ (1/24), అశ్విన్‌ (2)ను రషీద్‌ పెవిలియన్‌ చేర్చారు. అప్పటికే ఔటైన యశస్వి స్థానంలో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా వచ్చిన పరాగ్‌ (4) ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో రాజస్థాన్‌ 10 ఓవర్లకు 72/5తో కష్టాల్లో పడింది. రషీద్‌ బాటలో సాగుతూ మరో అఫ్గాన్‌ స్పిన్నర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో వైవిధ్యంతో వికెట్లు పడగొట్టాడు. మొదట దేవ్‌దత్‌ పడిక్కల్‌ (12)ను బౌల్డ్‌ చేసిన అతను.. తర్వాత ధ్రువ్‌ జూరెల్‌ (9)ను వెనక్కిపంపాడు. నాలుగో స్టంప్‌ మీద పడి కాస్త లోపలికి తిరిగిన బంతిని డిఫెండ్‌ చేద్దామని పడిక్కల్‌ ప్రయత్నించగా.. అది బ్యాట్‌కు సమీపం నుంచి వెళ్లి స్టంప్స్‌ను ముద్దాడింది. తన చివరి ఓవర్‌ కోసం మళ్లీ బంతి అందుకున్న రషీద్‌.. హెట్‌మయర్‌ (7)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో రాజస్థాన్‌ చివరి ఆశ కూడా ఆవిరైంది. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఎక్కువ సేపు పట్టలేదు. తిరుగులేని యార్కర్‌తో బౌల్ట్‌ (15)ను షమి (1/27) బౌల్డ్‌ చేయగా.. ఎక్స్‌ట్రా కవర్‌లో బౌండరీ దగ్గర నుంచి అభినవ్‌ నేరుగా విసిరిన త్రోకు జంపా (7) రనౌటయ్యాడు.


బౌల్ట్‌ సిక్సర్‌.. కెమెరామన్‌కు గాయం

గుజరాత్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఆటగాడు బౌల్ట్‌ కొట్టిన ఓ సిక్సర్‌ టీవీ కెమెరామన్‌ను గాయపరిచింది. నూర్‌ అహ్మద్‌ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ మూడో బంతిని బౌల్ట్‌ మిడ్‌వికెట్‌ మీదుగా బౌండరీ బయటకు తరలించాడు. ఆ బంతి అక్కడే విధుల్లో ఉన్న టీవీ కెమెరామన్‌పై పడింది. అతను నొప్పితో బాధపడ్డాడు. అస్వస్థతకు గురై వైద్య చికిత్స తీసుకున్న కెమెరామన్‌ దగ్గరికి టైటాన్స్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రా, స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ వెళ్లి పరిస్థితి తెలుసుకున్నారు.


రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి రనౌట్‌ 14; బట్లర్‌ (సి) మోహిత్‌ (బి) హార్దిక్‌ 8; శాంసన్‌ (సి) హార్దిక్‌ (బి) లిటిల్‌ 30; దేవ్‌దత్‌ (బి) అహ్మద్‌ 12; అశ్విన్‌ (బి) రషీద్‌ 2; పరాగ్‌ ఎల్బీ (బి) రషీద్‌ 4; హెట్‌మయర్‌ ఎల్బీ (బి) రషీద్‌ 7; ధ్రువ్‌ జూరెల్‌ ఎల్బీ (బి) అహ్మద్‌ 9; బౌల్ట్‌ (బి) షమి 15; జంపా రనౌట్‌ 7; సందీప్‌ శర్మ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (17.5 ఓవర్లలో ఆలౌట్‌) 118    
వికెట్ల పతనం: 1-11, 2-47, 3-60, 4-63, 5-69, 6-77, 7-87, 8-96, 9-112
బౌలింగ్‌: షమి 4-0-27-1; హార్దిక్‌ 2-0-22-1; రషీద్‌ ఖాన్‌ 4-0-14-3; జోష్‌ లిటిల్‌ 4-0-24-1; నూర్‌ అహ్మద్‌ 3-0-25-2; మోహిత్‌ 0.5-0-5-0

గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా నాటౌట్‌ 41; శుభ్‌మన్‌ (స్టంప్డ్‌) శాంసన్‌ (బి) చాహల్‌ 36; హార్దిక్‌ నాటౌట్‌ 39; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (13.5 ఓవర్లలో ఒక వికెట్‌కు) 119
వికెట్ల పతనం: 1-71
బౌలింగ్‌: బౌల్ట్‌ 3-0-28-0; సందీప్‌ శర్మ 3-0-19-0; జంపా 3-0-40-0; చాహల్‌ 3.5-0-22-1; అశ్విన్‌ 1-0-8-0



 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని