నేను చనిపోయే ముందు.. ఈ దృశ్యాలను చూడాలనుకుంటున్నా: గావస్కర్‌

ధోని వద్ద ఆటోగ్రాఫ్‌ తీసుకుంటున్నప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యానని బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. సోమవారం చెన్నై, కోల్‌కతా మధ్య చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌కు గావస్కర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.

Updated : 17 May 2023 05:08 IST

ముంబయి: ధోని వద్ద ఆటోగ్రాఫ్‌ తీసుకుంటున్నప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యానని బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. సోమవారం చెన్నై, కోల్‌కతా మధ్య చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌కు గావస్కర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. మ్యాచ్‌ అనంతరం సీఎస్కే బృందం మైదానంలో తిరుగుతుండగా ధోని దగ్గర అతడు ఆటోగ్రాఫ్‌ తీసుకోవడం అందరినీ ఆకర్షించింది. ‘‘చెన్నై సూపర్‌కింగ్స్‌, ధోని మైదానంలో తిరుగుతూ ప్రేక్షకులకు పలకరిస్తారని తెలిసిన వెంటనే ఓ ప్రత్యేక జ్ఞాపకాన్ని సృష్టించుకోవాలనుకున్నా. అందుకే ఆటోగ్రాఫ్‌ కోసం ధోని వద్దకు పరుగెత్తా. సొంతగడ్డపై అదే అతడి చివరి మ్యాచ్‌’’ అని గావస్కర్‌ అన్నాడు. ‘‘మహి దగ్గరకు వెళ్లి నేను వేసుకున్న చొక్కాపై సంతకం చేయాలని కోరా. అందుకు అతడు అంగీకరించడం సంతోషాన్నిచ్చింది. అది నాకు అత్యంత ఉద్విగ్న క్షణం. ఎందుకంటే ఆ మనిషి భారత క్రికెట్‌కు ఎంతో సేవ చేశాడు’’ అని చెప్పాడు. ‘‘సీఎస్కే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తే అతడికి మరోసారి చెన్నైలో ఆడే అవకాశం వస్తుందనుకోండి. కానీ నేను మాత్రం ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా మలచుకోవాలనుకున్నా.  నా అదృష్టంకొద్దీ కెమెరా బృందంలో ఒకరి వద్ద మార్కర్‌ పెన్‌ ఉంది. అతడికి కూడా నా కృతజ్ఞతలు’’ అని గావస్కర్‌ అన్నాడు. భారత క్రికెట్‌ చరిత్రలో ప్రత్యేక సందర్భాలను అతడు గుర్తు చేసుకున్నాడు. ‘‘కపిల్‌ 1983 ప్రపంచకప్‌ను ఎత్తుకోవడం, 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో ధోని సిక్స్‌ కొట్టి గెలిపించడం గొప్ప  క్రికెటింగ్‌ సందర్భాలు. నేను చనిపోయేముందు ఈ దృశ్యాలను చూడాలనుకుంటున్నా’’ అని గావస్కర్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని